కామన్ సివిల్ కోడ్ కు ఆప్ మద్దతు- బీజేపీకి పోటీగా..? కాంగ్రెస్ తో విభేదాల నేపథ్యంలో..
ఓవైపు దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం పావులు కదుపుతోంది. మరోవైపు లా కమిషన్ దీనిపై అభిప్రాయ సేకరణ చేపడుతోంది. అదే సమయంలో ప్రధాని మోడీ కూడా దేశంలో రెండు చట్టాలు ఉండకూడదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు మండిపడుతున్నాయి. కానీ తాజాగా జాతీయ పార్టీగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇవాళ కామన్ సివిల్ కోడ్ కు మద్దతివ్వాలని నిర్ణయించింది.
ఆప్ భారతీయుల కోసం సూత్రప్రాయంగా ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తుందని పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ ఇవాళ వెల్లడించారు. అయితే ఈ దిశలో ఏదైనా చర్య తీసుకోవాలంటే అందరు భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరపాలని ఆన సూచించారు. తాము సూత్రప్రాయంగా యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇస్తున్నామని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా దీనికి మద్దతు ఇస్తుందని పాఠక్ తెలిపారు.

అయితే ఈ సమస్య అన్ని మత వర్గాలకు సంబంధించినది కాబట్టి, పరిష్కారం కూడా విస్తృతంగా ఉండాలని పాఠక్ సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తున్న తరుణంలో ఆప్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ తాజాగా ఉమ్మడి పౌరస్మృతికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం ఇవాళ ఎజెండాతో నడిచే మెజారిటీ ప్రభుత్వం ద్వారా ప్రజలపై యూనిఫాం కోడ్‌ను బలవంతంగా రుద్దడం సాధ్యం కాదన్నారు. అలాగే మోడీ వ్యాఖ్యల్ని ముస్లిం సంఘాలు కూడా ఖండించాయి. దేశంలోని అత్యున్నత ముస్లిం సంస్థ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా గత రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించింది.












Click it and Unblock the Notifications