టికి కేజ్రీవాల్ పార్టీ ఓకే, లోక్‌సత్తా విలీనమే, విభజన సెగ
హైదరాబాద్: తెలంగాణకు తాము అనుకూలమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) ప్రకటించింది. చిన్న రాష్ట్రాలకు తమ పార్టీ అనుకూలమని, ఎపి విభజన పూర్తయితే సార్వత్రిక ఎన్నికల్లో ఇరు ప్రాంతాల నుంచి పోటీ చేస్తామని ఎఎపి జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రకటించారు. పాలకుల వివక్ష, ప్రాంతాల మధ్య అసమానతల వల్లే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్నారు.
విభజన అంశాన్ని ఇక్కడి పార్టీలు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజల మధ్య విధ్వేషాలు రగులుస్తున్నాయన్నారు. ఢిల్లీ ఎన్నికల అనంతరం శనివారం మొదటిసారి నగరానికి వచ్చిన ఆయన దోమలగూడలోని ఎవి కళాశాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మొదట కార్యకర్తల సమావేశంలో, ఆ తర్వాత విలేకరులతో వివిధ అంశాలపై మాట్లాడారు. నిజాయితీపరుడినని చెప్పుకునే నరేంద్ర మోడీ కూడా బడా సంస్థల చేతిలో కీలుబొమ్మే అన్నారు.

విధానపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకునే ఎన్నికలముందు పొత్తులు పెట్టుకోవద్దని నిర్ణయించామని, సిద్ధాంత సారూప్యత ఉన్న పార్టీల విలీనానికి సానుకూలమన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని ఎనిమిది మంది సభ్యులతో రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీ నియమించామని తెలిపారు. విభజన అంశం చిన్నదని, దేశాన్ని అంతకంటే పెద్ద సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు. ఎఎపి అనేది పార్టీ కాదని సామాన్యుడి తిరుగుబాటు అన్నారు.
ఇది విజయవంతం కాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మనం ఎక్కడికి వెళ్తామో ఊహించుకోవడం కష్టమన్నారు. అదే జరిగితే దేశంలో అంతర్యుద్దం తప్పదన్నారు. కాంగ్రెసు, బిజెపిలు రెండు పూర్తిగా అవినీతిమయంగా మారాయన్నారు. బిజెపి నేరుగా మతతత్వాన్ని రెచ్చగొడుతుంటే, కాంగ్రెసు లౌకిక ముసుగు ధరించి రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రాంతీయ పార్టీల తీరు అలాగే ఉందని ఆరోపించారు.
ఢిల్లీలో తమ సర్కారును పడగొట్టేందుకు కాంగ్రెసు, బిజెపిలు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. న్యాయవ్యవస్థ సైతం అవినీతిమయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోమని, లోక్ సత్తా సహా తమతో పొత్తుకు ప్రయత్నిస్తున్న ఏ పార్టీ అయినా తమ పార్టీలో విలీనం కావాల్సిందే అన్నారు. లోక్ సత్తా పార్టీతో చర్చలు సాగుతున్నాయని తెలిపారు.
జై తెలంగాణ
ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ నగరంలోని ఎవి కాలేజీలో ఏర్పాటు చేసిన సభకు విభజన సెగ తగిలింది. తాము చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రశాంత్ భూషణ్ సభలో చేసిన వ్యాఖ్యలపై సభకు వచ్చిన సీమాంధ్ర నేతలు అభ్యంతరం తెలిపారు. సభలో నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ నేతలు నిరసన తెలపడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.












Click it and Unblock the Notifications