జాతీయ పార్టీగా ఆప్ ? రేపు గుజరాత్, హిమాచల్ ఫలితాలతో -జస్ట్ ఇవి సాధిస్తే చాలు..!
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి 15 ఏళ్ల తర్వాత ఆ పార్టీని పీఠానికి దూరం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి రేపు మరో గుడ్ న్యూస్ అందబోతోంది. రేపు జరిగే గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనీస ప్రదర్శన చూపినా ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కబోతోంది. దీంతో ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ నెలకొంటోంది. ఆప్ జాతీయ పార్టీగా అవతరిస్తే అది కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బగా మారబోతోంది.

జాతీయ పార్టీగా ఆప్
ఢిల్లీలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక, లోక్ పాల్ సాధన ఉద్యమంతో ప్రస్ధానం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత వరుస సంచలనాలు నమోదు చేసింది. ముందుగా 2013లో తొలిసారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టి తొలిసారి బొటాబోటీ మెజారిటీతో గద్దెనక్కిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత 2015లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీతో మళ్లీ గెలిచింది. ఆ తర్వాత 2020లో మరోసారి అదే స్ధాయి మెజారిటీతో గద్దెనెక్కిన ఆప్.. క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించడం మొదలుపెట్టింది. అదే క్రమంలో ఇప్పుడు జాతీయ పార్టీగా మారబోతోంది.

జాతీయ పార్టీగా రోడ్ మ్యాప్
ఢిల్లీలో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ తర్వాత ఈ ఏడాది పంజాబ్ లోనూ అధికారం సాధించి వరుసగా రెండో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అప్పుడే జాతీయ పార్టీగా మారేందుకు వ్యూహరచన చేయడం మొదలుపెట్టింది. తమకు అస్సలు బలం లేని గోవావంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా ఫలితాలు ఆశించిన స్దాయిలో రాలేదు. అయినా నిరాశ పడకుండా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా జాతీయ పార్టీ అయ్యే అవకాశాల్ని మరింత సులభతరం చేసుకుంది. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు వెలువడితే వాటిలో ఆప్ జాతీయ పార్టీగా మారుతుందా లేదా అన్నది తేలిపోనుంది.

గుజరాత్,హిమాచల్ లో కనీస ప్రదర్శన చాలు !
రేపు గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇందులో కనీసం ఆరుశాతం ఓట్లతో పాటు కనీసం రెండు సీట్లు సాధిస్తే చాలు ఆప్ జాతీయ పార్టీగా మారేందుకు మార్గం సుగమం అవుతుంది. గుజరాత్ లేదా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరుశాతం ఓట్లు, రెండు సీట్లు సాధిస్తే చాలు ఆప్ జాతీయ పార్టీగా మారడం ఖాయం. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ కనీస ప్రదర్శన చూపిస్తే జాతీయ పార్టీగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications