వెస్ట్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి: శరీరంపై బుల్లెట్ గాయాలు
Gurpreet Gogi: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా సొంతంగా బరిలో దిగిన త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయమౌతుంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ రోజు నుంచి నామనేషన్లను దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 17.

ఈ పరిస్థితుల మధ్య పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన శాసన సభ్యుడు గుర్‌ప్రీత్ గోగి బస్సీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. బుల్లెట్ గాయాలతో రక్తపుమడుగులో పడివున్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక దయానంద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన పేరు గుర్‌ప్రీత్ గోగి.. పంజాబ్‌లోని లూధియానా వెస్ట్ నియోజకర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. హిస్సార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చారు. భోజనం చేసి తన గదికి వెళ్లారు. ఆ కొద్దిసేపటికే బుల్లెట్ శబ్దం వినిపించింది.
దీనితో ఆయన భార్య సుఖ్‌చైన్ గోగి హుటాహుటిన గదిలోకి వెళ్లి చూడగా.. రక్తపుమడుగులో కనిపించారాయన. వెంటనే దయానంద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గోగి మరణించారని డాక్టర్లు వెల్లడించారు.

బుల్లెట్ ఎలా తగిలిందనే విషయం అంతుచిక్కట్లేదు. లైసెన్స్డ్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తోన్న సమయంలో అది పొరపాటున పేలివుండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే లూధియానా డిప్యూటీ పోలీస్ కమిషనర్ జస్‌కరణ్ సింగ్ తేజా ఆసుపత్రికి చేరుకున్నారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. బుల్లెట్ ఎలా తగిలిందనే విషయంపై ఆరా తీస్తోన్నామని చెప్పారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. దీనితో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications