8 ఏళ్లలో 3 వేల మంది విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ దాడులు-పార్లమెంటులో ఆప్ ఎంపీ వెల్లడి
2014లో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తుసంస్ధల దాడులు పెరిగాయి. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా విపక్ష నేతలపై సీబీఐ,ఈడీ వంటి సంస్ధలు దాడులు నిర్వహించినా వాటితో పోలిస్తే ఎన్డీయే హయాంలో ఇవి భారీగా పెరిగాయి. ఎన్డీయే 8 ఏళ్ల పాలనలో 3 వేల మందికి పైగా విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలు దాడులు చేసినట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.
కేంద్రం జాతీయ స్ధాయి దర్యాప్తుసంస్ధల్ని ఎలా దుర్వినియోగం చేస్తోందన్న అంశంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం 3 వేలకు పైగా విపక్ష నేతలపై దర్యాప్తు సంస్ధల్ని ఉసిగొల్పడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. 3 వేలకు పైగా విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ దాడులు చేస్తే అందులో కేవలం 23 మందిపైనే అభియోగాలు నిరూపణ అయ్యాయని, ఇది కేవలం 0.5 శాతం మాత్రమేనన్నారు.దీంతో జోక్యంచేసుకున్న రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ చట్టప్రకారం నిర్దారణ అయిన పత్రాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని ఆయనకు సూచించారు.

అంతే కాదు రాజ్యసభలో సభ్యులు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో విఫలమైతే చర్యలు తప్పవని ధన్ కర్ హెచ్చరించారు. సభలో చేసే ప్రకటన ఏదైనా ఖచ్చితత్వంతో, పవిత్రతతో కూడినదై ఉండాలన్నారు. సభ్యుడు వాస్తవ గణాంకాలపై దృష్టి సారించాలన్నారు. అలాగే సంబంధిత రికార్డును సభ రికార్డుల్లో ఉంచాలన్నారు.
ఈ సభ ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని వెల్లడించే వేదికగా ఉండాలని రాజ్యసభ ఛైర్మన్ సూచించారు. అభిప్రాయాల్ని ఇక్కడ నిర్దారించలేమన్నారు. వార్తాపత్రిక నివేదిక, ఎవరైనా ఇచ్చిన అభిప్రాయం వల్ల ఎటువంటి ఫలితం ఉండదన్నారు. చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన పత్రాలు మాత్రమే ఆరోపణ చేయడానికి ఆధారంగా ఉండాలని ధన్ కర్ సూచించారు.
అయితే గతంలో ప్రధాని మోడీ కూడా సభ బయట కూడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని వ్యాఖ్యానించినట్లు విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. కొన్నిసార్లు ఆధారాలు లేకపోయినా పత్రికల్లో వచ్చే వార్తలే నిజమైన సందర్భాలున్నాయన్నారు. దీనిపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ ధన్ కర్ ఈ వ్యవహారంపై తాను సభ్యులతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు.












Click it and Unblock the Notifications