
రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్: మాజీ క్రికెటర్, సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేట్
చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శకం ఆరంభమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్- పరిపాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. పరిపాలనను పరుగులెత్తిస్తోన్నారు. 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన రోజే వారిని సమావేశపరిచారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఏకంగా 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను ఆమోదించారు. ఎన్నికల హామీలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

హర్భజన్ నామినేట్..
దీనికి అనుగుణంగా- పంజాబ్‌లో అటు పార్టీని కూడా బలోపేతం చేయడంపై అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబీయులకు ఆరాధ్యుడైన మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఆయనను పెద్దల సభకు నామినేట్ చేసింది. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది.

ఆప్‌కు అయిదు..
117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో- ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ పార్టీకి దక్కిన సీట్లు 18 మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ తాను పోటీ చేసిన రెండో చోట్లా ఓడిపోయారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పరాజయం పాలయ్యారు. వారిపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఐఐటీ ప్రొఫెసర్
దీనితో పంజాబ్ నుంచి మొత్తంగా అయిదుమందిని రాజ్యసభకు పంపించడానికి అవసరమైన బలం ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కింది. ఇందులో భాగంగా ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసిందా పార్టీ. మిగిలిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. హర్భజన్ సింగ్‌తో పాటు ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జ్ రాఘవ్ ఛద్దా, ఐఐటీ-ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్‌ను నామినేట్ చేసింది.

లవ్లీ యూనివర్శిటీ ఛాన్సలర్..
డాక్టర్ సందీప్ పాఠక్- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. మరో స్థానాన్ని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్‌కు కేటాయించింది. మిగిలివున్న అయిదో స్థానం కోసం అభ్యర్థి పేరును ఖరారు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై కసరత్తు చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. రాజ్యసభకు నామినేట్ చేయదలిచిన అయిదో అభ్యర్థి పేరును ఈ మధ్యాహ్నానికి ఖరారు చేస్తుందని తెలుస్తోంది.

జులైలో మరో రెండు
కాగా- పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయినవారి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీన ముగియనుంది. కాంగ్రెస్ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా, ఎస్ఎస్ డుల్లో, బీజేపీకి చెందిన ష్వైత్ మలిక్, శిరోమణి అకాలీదళ్ సభ్యుడు నరేష్ గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్-సంయుక్త్‌కు చెందిన ఎస్ఎస్ ధిండ్సా సభ్యత్వం ముగుస్తుంది.
దీనితో ఆయా స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికలు జరుగునున్నాయి. పంజాబ్ నుంచే రాజ్యసభకు నామినేట్ అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోని, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన బల్వీందర్ సింగ్ భుందేర్ సభత్యవం జులై 4న ముగుస్తుంది. ఈ స్థానాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి.