ఆప్ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారు.. అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళుతుంది. ఇప్పటికే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలే సీఎం అభ్యర్థిని ఎన్నుకునేలా ఓ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. సీఎంగా ఎవరు కావాలో ఆ నెంబర్ కు ఫోన్ చేసి అభ్యర్థి పేరు చెప్పాలని సూచించారు.
7074870748 నెంబర్ కు ఫోన్ చేసి అభిప్రాయం చెప్పాలని కేజ్రీవాల్ కోరారు. ఇన్నేళ్ల నుంచి ఎన్నికలు జరుగుతున్నా.. ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండదన్నారు. దేశ చర్రితలోనే సీఎం అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావొచ్చునని పేర్కొన్నారు. ఫోన్ చేసి గానీ, వాట్సాప్ లో మెసేజ్ ద్వారా గానీ ప్రజలు అభిప్రాయం చెప్పొచ్చని తెలిపారు. జనవరి 17 సాయంత్రం 5 గంటల లోపు ప్రజలు తమ అభీష్టాన్ని చెప్పాలన్నారు.

వాస్తవానికి ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్ ఉన్నా ఆయనపై చాలా మంది నేతలు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయంలోనూ కేజ్రీవాల్ స్పందించారు. భగవంత్ మన్ తనకు అత్యంత కావాల్సిన వ్యక్తి అని అన్నారు. తాము ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా.. ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేద్దామంటూ ఆయనే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. తలుపులు అన్నీ మూసేసి నాలుగు గదుల మధ్య సీఎం అభ్యర్థిని నిర్ణయించడం మంచి పద్ధతి కాదంటూ ఆయన కూడా చెప్పారన్నారు.
ఇటు ఫిబ్రవరి 14న పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న అన్నీ రాష్ట్రాలతో కలిపి వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications