
పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్: కేజ్రీవాల్ ఈ అద్భుత విజయం ఎలా సాధించారు? కాంగ్రెస్ ఓటమికి సిద్ధూ ఎలా కారణమయ్యారు?
ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. దిల్లీలో 2015 నుంచి అధికారంలో ఉన్న ఆప్.. ఇప్పుడు పంజాబ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారం చేపట్టబోతోంది. ఇప్పుడు భారతదేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మూడో పార్టీగా ఆప్ అవతరిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి మూటగట్టుకుంటోంది.
కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీ దళ్, బీజేపీల మధ్య జరిగిన చతుర్ముఖ సమరంలో.. ఆప్ క్లీన్ స్వీప్ చేస్తోంది. 'ఆమ్ ఆద్మీ' హవాలో ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. రెండు చోట్లా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులే గెలిచారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 6,750 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ స్థానంలో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ గెలుపొందారు. ఇక మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ కూడా పటియాలా స్థానం నుంచి 19,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ వంటి హేమాహేమీలు సైతం ఓటమి బాటలో పయనిస్తున్నారు.
పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20వ తేదీన పోలింగ్ జరగగా.. కౌంటింగ్ గురువారం జరుగుతోంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 77 శాతానికి పైగా పోలింగ్ నమోదవగా ఈసారి 65.50 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
https://twitter.com/ANI/status/1501851995543846914
ఓట్ల లెక్కింపులో గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి 117 స్థానాలకు గానూ ఆప్ 20 సీట్లు గెలుచుకుని, మరో 71 సీట్లలో ముందంజలో ఉంది. మొత్తం 91 స్థానాల్లో ఆధిక్యంతో సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకెళుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లలో గెలిచింది. మరో 17 స్థానాల్లో ముందంజలో ఉంది.
శిరోమణి అకాలీ దళ్ ఒక సీటు గెలుచుకుని, మరో 2 సీట్లలో ముందంజలో ఉండగా.. బీజేపీ ఒక సీటు గెలుచుకుని మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి మరో స్థానంలో ముందంజలో ఉన్నారు.
''మేం సామాన్యులం (ఆమ్ ఆద్మీ). కానీ సామాన్యుడు తిరగబడితే మహా సింహాసనాలు కదిలిపోతాయి. భారతదేశ చరిత్రలో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఆమ్ ఆద్మీ పార్టీ మరో రాష్ట్రంలో గెలవటమే కాదు.. మా పార్టీ ఓ జాతీయ శక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ స్థానంలో ఆప్ ప్రత్యామ్నాయంగా మారుతుంది'' అని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కో-ఇన్‌చార్జ్ రాఘవ్ చద్దా మీడియాతో పేర్కొన్నారు.
- భగవంత్ మాన్: కమెడియన్, పొలిటీషియన్... కాబోయే పంజాబ్ సీఎం
- పంజాబ్ ఎన్నికలు: సీఎం రేసులో ఉన్న ఈ ఆరుగురి బలాలు, బలహీనతలు ఏంటి
కేజ్రీవాల్ 'మార్పు' మాయాజాలం
ఆప్ 'మార్పు' నినాదం పంజాబ్‌లో పార్టీల తలరాతలు మార్చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన నమూనా ఆప్ ప్రచారానికి ప్రధాన భూమికగా మారింది.
ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల పనితీరు మెరుగుపరచటం, ప్రజలందరికీ కొన్ని యూనిట్ల విద్యుత్తు, కొన్ని లీటర్ల నీళ్లు ఉచితంగా అందించటం, రైతులకు రాయితీలు ఇవ్వటం వంటి సంక్షేమ పథకాలను దిల్లీలో విజయవంతంగా అమలు చేస్తున్నామని.. దిల్లీలో చేసిన పనిని ఏ రాష్ట్రంలోనైనా చేయగలమని ఆప్ ప్రచారం చేసింది.
పంజాబ్‌లో మాదకద్రవ్యాల రుగ్మతను రూపుమాపుతామని, పవిత్ర స్థలాలను అపవిత్రం చేసిన కేసులపై చర్యలు చేపడతామనే అంశాలను కూడా కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారంలో చేర్చారు.
అందుకోసం పంజాబ్‌లో 'బదలావ్' (మార్పు) కావాలనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది. ఆప్ వ్యూహాలు సఫలమైనట్లు ఈ ఎన్నికల ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. పంజాబ్‌లో ఆప్ క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తోంది.
ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా ఉన్న పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్.. ధురీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీ మీద 58,206 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న భగవంత్ మాన్‌కు ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ విప్లవం సాధించినందుకు' పంజాబ్ ప్రజలను ట్విటర్ ద్వారా అభినందించారు కేజ్రీవాల్.
https://twitter.com/ArvindKejriwal/status/1501808836297977857
- గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?
- దళితుడిని నరికి, బ్యారికేడ్‌కు వేలాడదీసిన ఘటనకు ముందు, తర్వాత ఏం జరిగింది? - గ్రౌండ్ రిపోర్ట్
2017 ఎన్నికల్లోనే ఆప్ హవా
నిజానికి 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆప్ విజయం సాధిస్తుందని విస్తృత అంచనాలు ఉన్నాయి. అయితే.. ఆ ఎన్నికల్లో ఆప్ కేవలం 20 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లో నాలుగు ఎంపీ సీట్ల నుంచి ఒక్క ఎంపీ సీటుకు దిగజారింది. అంతేకాదు.. పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కూడా దూరమయ్యారు.
అనంతరం 2021 సెప్టెంబర్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో రాష్ట్రంలో అసలైన 'సామాన్యుడు' ఎవరు అనే దాని మీద కేజ్రీవాల్, చన్నీల మధ్య పోటీ తలెత్తింది.
ఈ ఎన్నికల చివరి అంకంలో.. కేజ్రీవాల్ మీద అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ విమర్శలు ఎక్కుపెట్టాయి. ఆయన వేర్పాటువాద గ్రూపుల సానుభూతిపరుడని ఆరోపించాయి. ఈ దాడిని కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నారు. ప్రపంచంలోకెల్లా.. స్కూళ్లు, ఆస్పత్రులను నిర్మించాలని తలపోసే 'అత్యంత మధురమైన ఉగ్రవాది'ని తానేనని అభివర్ణిస్తూ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టారు.
అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ప్రజామోదం కోల్పోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లకు ఒక తాజాదనాన్ని అందించిందని.. కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు విద్య, ఆరోగ్యం, ఉపాధి, మహిళలకు సదుపాయాల మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారని బీబీసీ పంజాబీ ఎడిటర్ అతుల్ పేర్కొన్నారు.
''మిగతా పోటీదారులంతా లేవనెత్తుతున్న భద్రతాంశాలు, ఖలిస్తాన్ ఆరోపణలు, పంజాబీ - పంజాబీయేతర వాదోపవాదాలతో తమ ప్రచారం దారిమళ్లకుండా చూసుకున్నారు. కొత్త ముఖాలను, రాజకీయేతర వ్యక్తులను పోటీకి దించటం, సామాన్య మూలాలున్న భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం వంటి ఆప్ వ్యూహాలు ఓటర్ల ఆమోదం పొందాయి'' అన్నారాయన.
- చరణ్‌జీత్ సింగ్ చన్నీ: పంజాబ్‌లో ప్రభుత్వ వ్యతిరేకతకు కాంగ్రెస్ పరిష్కారం చూపినట్లేనా
- పంజాబ్ రైతుల మాదిరిగా.. వేరే రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చెయ్యట్లేదు?

'కాంగ్రెస్ పతనానికి సిద్ధూయే కారణం'
పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ అవమానకరమైన ఓటమి దిశగా పయనిస్తోంది. గత ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి 19 సీట్లలోనే ముందంజలో ఉంది. ఈ దారుణ ఫలితాలకు.. రాజకీయ నాయకుడిగా మారిన క్రికెట్ క్రీడాకారుడు, రెండుసార్లు ఎంపీగా గెలిచిన నవజ్యోత్ సింగ్ సిద్ధూది ప్రధాన బాధ్యతని బీబీసీ పంజాబీ ఎడిటర్ అతుల్ సాగర్ అభిప్రాయపడ్డారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాత్ర కూడా పాక్షికంగా ఉందన్నారు.
''కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో హామీలు అమలు చేయలేదని, సుపరిపాలన అందించలేదని కెప్టెన్ అమరీందర్ సింగ్ సర్కారును ప్రతిపక్షాలైన ఆప్ కానీ, అకాలీ దళ్ కానీ ఇరుకున పెట్టలేకపోయాయి. ప్రతిపక్షాలు చేయలేక పోయిన ఈ పనిని సిద్ధూ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు చేశారని, వారు తమ సొంత కాంగ్రెస్ పార్టీని బోనులో నిలబెట్టారని చెప్పొచ్చు'' అని అతుల్ విశ్లేషించారు.

''పంజాబ్‌లో స్వతంత్ర పాలకుడిగా రాజ్యం చేస్తున్న కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను అదుపులో పెట్టటానికి.. రాహుల్, ప్రియాంకలు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకి దాదాపుగా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పాలనలో వైఫల్యం, హామీలు అమలు చేయకపోవటం, అవినీతి పాలన.. అంటూ అమరీందర్ సర్కారు మీద సిద్ధూ దాదాపు ఏడాది పాటు అడ్డూ అదుపూ లేకుండా దాడి చేశారు.
ఒక యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరీ కెప్టెన్ అమరీందర్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయటం మొదలుపెట్టారు. అమరీందర్ సర్కారుపై ప్రభుత్వ వ్యతిరేకత వాతావరణాన్ని నిర్మించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించిన తర్వాత కూడా ఆయన తన ప్రభుత్వ వ్యతిరేక దాడిని కొనసాగించారు'' అని ఆయన వివరించారు.
https://twitter.com/sherryontopp/status/1501814597409390594
- పంజాబ్: సిద్ధూతో ఎవరికి నష్టం? పార్టీకా, ఆయనకా?
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
దళిత నాయకుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా చేయటంతో పాటు.. ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపటం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం తెలివిగా ప్రవర్తించిందని అతుల్ పేర్కొన్నారు. అయితే.. తమ పార్టీ దళితులు, పేదల పక్షాన నిలుస్తుందనే సందేశాన్ని పదే పదే ఉద్ఘాటించటం, 'పంజాబ్ ముఖ్యమంత్రిగా ఒక సిక్కు నేతే ఉండాలి' అని ప్రకటనలు చేయటం పార్టీకి నష్టం చేశాయన్నారు.
''అలాంటి ప్రకటనల వల్ల.. గత 20 ఏళ్లలో కాంగ్రెస్‌కు దగ్గరైన సంప్రదాయ హిందూ ఓటర్లు, జాట్ సిక్కు ఓటర్లను దూరం చేసుకుంటున్నామనే విషయాన్ని కాంగ్రెస్ విస్మరించింది'' అన్నారాయన.
''కెప్టెన్ అమరీందర్ మంత్రివర్గం మొత్తాన్నీ తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత ఆయన కేబినెట్‌లోని కొందరు మంత్రులను చన్నీ మంత్రివర్గంలో చేర్చటమే కాకుండా, ఎన్నికల బరిలోనూ దించింది. ఇప్పుడు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో పాటు కేబినెట్ మంత్రులందరూ తమ స్థానాల్లో ఓటమి బాటలో ఉన్నారంటే ఆశ్చర్యం అవసరం లేదు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఇవే అత్యంత దారుణ ఫలితాలు అవుతాయేమో'' అని చెప్పారు అతుల్.
https://twitter.com/ANI/status/1501832735861936130
కుదేలైన అకాలీ, బీజేపీ
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై బీజేపీతో విభేదించి ఆ పార్టీతో స్నేహాన్ని తెంచుకున్న శిరోమణి అకాలీ దళ్ పార్టీ.. ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో కలిసి పోటీ చేసింది. ఆ పార్టీ కేవలం మూడు స్థానాల్లోనే ముందంజలో ఉంది.
ఇక పంజాబ్‌లో తొలిసారి అత్యధికంగా 54 సీట్లకు పోటీ చేసిన బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ కొత్తగా స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో పాటు.. ఎస్ఎస్ ధిండ్సా సారథ్యంలోని శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్) పార్టీతో జట్టు కట్టి బీజేపీ ఈ ఎన్నికల్లోకి దిగింది.
ఇవి కూడా చదవండి:
- యోగి ఆదిత్యనాథ్: విద్యార్థి నాయకుడి నుంచి 'ముఖ్యమంత్రీ మహారాజ్' వరకు సాగిన ప్రయాణం
- షేన్ వార్న్ స్పిన్ బౌలింగ్: 'నేను వార్న్‌కు కీపింగ్ చేయలేను’ అంటూ గ్లోవ్స్ విసిరికొట్టిన కీపర్.. ఒకే మ్యాచ్‌లో ముగ్గురు కీపర్లు
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?
- భారత్-పాకిస్తాన్ జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా టపాసులు పేలవు ఎందుకు?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)