కోవిషీల్డ్, కోవాగ్జిన్ అంగీకరించకుంటే క్వారంటైన్ ఉండాల్సిందే: ఈయూకు తేల్చి చెప్పిన భారత్
న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కరోనావైరస్ వ్యాక్సిలను యూరోపియన్ యూనీయన్(ఈయూ) ఇప్పటి వరకు అంగీకరించకపోవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని యూరప్ దేశాలు తమ దేశాల్లోకి నేరుగా అనుమతించకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో భారత్ సీరియస్ అయ్యింది.
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ ను గుర్తించడంపై భారత్ సరస్పర విధానాన్ని ఏర్పాటు చేస్తుందని భారత విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అంటే ఇండియన్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లను యూరోపియన్ యూనియన్ అంగీకరించేంత వరకూ.. ఆ దేశాల వ్యాక్సిన్ సర్టిఫికేట్లను కూడా భారత్‌లో అంగీకరించరు.

యూరోప్ నుంచి భారత్‌కు వచ్చేవాళ్లు తప్పనిసరి క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే యూరోపియన్ యూనియన్.. డిజిటల్ కరోనా సెర్టిఫికేట్లో తప్పనిసరిగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను నోటిఫై చేయాలని ఈయూకి చెప్పడం జరిగిందని భాతర విదేశాంగ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది ఇలావుండగా, డిజిటల్ కోవిడ్ సర్టిఫికేట్ లేదా గ్రీన్ పాస్ జారీ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన కోవిషీల్డ్ వంటి టీకాలను ఆమోదించే అవకాశం సభ్యదేశాలకు ఉందని యూరోపియన్ యూనియన్ అధికారి ఒకరు వెల్లడించారు. భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కోవిషీల్డ్ అనుమతించాలన్న విజ్ఞప్తి ఐరోపా ఔషధ సంస్థ(ఈఎంఏ)కు అందలేదని ఆయన చెప్పారు.
ఈ సంస్థ నుంచి కోవిషీల్డ్ ఆమోదం లభించకపోవడంతో ఈ టీకా పొందినవారు ఐరోపా సభ్య దేశాల్లో ప్రయాణం చేయలేరన్న ఆందోళనలు నెలకొన్న క్రమంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈయూ సభ్యదేశాలు కోవిషీల్డ్ తోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన అన్ని టీకాలనూ ఆమోదించవచ్చని సదరు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications