బ్లాక్ మనీ: తగ్గిన షేర్ విలువ, లిస్ట్‌లో కాంగ్రెస్ నేతలు?
న్యూఢిల్లీ/ముంబై: కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన నల్ల కుబేరుల జాబితాలో డాబర్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్ పేరు ఉండటంతో సోమవారం ఉదయం ట్రేడింగులో కంపెనీ షేర్ల విలువ 9 శాతం పడిపోయింది. బీఏఎస్ఈ, ఎన్ఎస్ఈలలో మొదట సుమారు 9 శాతం తగ్గి తర్వాత కొంతమేర పుంజుకున్నా గతం కంటే షేరు విలువ తక్కువగానే ఉంది.
అయితే, ప్రదీప్ బర్మన్ పైన వచ్చిన ఆరోపణలను డాబర్ కంపెనీ ఖండించిన విషయం తెలిసిందే. బర్మన్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, విదేశీ ఖాతాల విషయంలో చట్ట ప్రకారమే నడుచుకున్నామని డాబర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్నారైగా ఉన్నప్పుడే బర్మన్ ఖాతా తెరిచారని, చట్టబద్ధంగా ఈ ఖాతా తెరవడానికి అనుమతి ఉందని, తాము అన్ని చట్టాలను అనుసరించామని, ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు చట్టం ప్రకారం, ఆదాయపన్ను శాఖకు అనుగుణంగానే ఉన్నాయని, అంతేకాక సరైన క్రమంలోనే పన్నులు చెల్లిస్తున్నామని, విదేశీ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తిపై అదే రంగు పులమడం దురదృష్టకరమని ప్రదీప్ బర్మన్‌కు మద్దతిస్తూ డాబర్ సంస్థ ఆ ప్రకటనలో పేర్కొంది.

అలాగే రాజ్‌కోట్‌కు చెందిన పంకజ్ చిమన్ లాల్ కూడా కేంద్రం తన పేరు ప్రకటించడంపై షాక్‌కు గురైనట్లు తెలిపారు. తనకు విదేశాల్లో అకౌంటే లేదని చెప్పారు. తన పేరు ఇలా వచ్చిందో తెలియదన్నారు. తాను సుప్రీం కోర్టులోనే వివరణ ఇస్తానని చెప్పారు. తాను తన ఆస్తులను ప్రకటించానని, బ్లాక్ మనీ లిస్టులో తన పేరు వింటున్నానని ఆయన వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
నల్ల కుబేరుల జాబితాలో కాంగ్రెస్ నేతలు?
స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపాదనను దాచుకున్న భారతీయ కుబేరుల జాబితాలో నలుగురు కాంగ్రెస్ నేతలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నలుగురిలో ఓ వ్యక్తి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో జూనియర్ మంత్రిగా పని చేశారని వాదనలు వినిపిస్తున్నాయి.
మిగిలిన ముగ్గురిలో మహారాష్ట్ర కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులుండగా, ఉత్తర ప్రదేశ్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన మాజీ నేత ఒకరు ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని ముగ్గురు నల్ల కుబేరుల పేర్లను సోమవారం వెల్లడించిన కేంద్రం, తాజాగా ఈ తరహా ప్రచారానికి తెర తీసిందని తెలుస్తోంది. ఈ నలుగురికి ఆదాయపన్ను శాఖ త్వరలో నోటీసులు జారీ చేయనుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications