కర్నాటకనే పట్టించుకోని వాడు.. రాజీవ్ చంద్రశేఖర్ పై నిప్పులు చెరిగిన ప్రకాష్ రాజ్..!
కేరళలోని తిరువనంతపపురం నుంచి లోక్ సభ అభ్యర్ధిగా బరిలోకి దిగిన బీజేపీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై కన్నడ నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. తిరువనంతపురం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాజీవ్ చంద్రశేఖర్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజీవ్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల నుంచి రాజ్యసభ ఎంపీగా కర్నాటక డిమాండ్లను ఎలా గాలికొదిలేశారో వివరించారు.
కర్నాటక నుంచి 18 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. తాను ఓ నటుడినని, రాజకీయ నేతను కాదని, కానీ సామాన్య ప్రజలు రాజకీయాలపై కూడా మాట్లాడవచ్చని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను మౌనంగా ఉండకపోవడం వల్లే ప్రజలు తనను ఇష్టపడతారన్నారు. తనకు కేరళ అంటే చాలా ఇష్టమని, మోడీ పాలనలో తాను అసౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు.

ఈసారి ఎన్నికలు చాలా కీలకమని, ప్రస్తుతం మన దేశాన్ని పాలిస్తున్న రాజు విధ్వంసం చేస్తాడని తన లాంటి కొందరు మాత్రమే ఊహించారని ప్రకాష్ రాజ్ తెలిపారు. గత ఎన్నికల్లో ఐదేళ్ల పాటు పాలించడానికి ఆయనకు అవకాశం ఇచ్చారని, కానీ ఈ ఐదేళ్లలో ఆయన చేసిన పనులన్నింటినీ మార్చాల్సిన అవసరం ఉందని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ దేశం ఏర్పాటైనప్పుడు సమాఖ్య రాజ్యంగా ఉండాలని అనుకున్నామని, రాజరికాన్ని కోరుకోలేదన్నారు. మన దగ్గర ఉమ్మడిగా ఒక్క వ్యవసాయ చట్టం కూడా లేదని, కానీ ఒకే భాష, ఒకే మతం గురించి మాట్లాడుతున్నామని ఎద్దేవా చేసారు.












Click it and Unblock the Notifications