క్షమించండి.. విచారణకు రాలేనన్న నటి తమన్నా భాటియా
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కున్న నటి తమన్నా భాటియాకు ఏప్రిల్ 29వ తేదీన అంటే నేడు సైబర్ పోలీసుల విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ కాపీరైట్స్ కేసులో నోటీసులు అందుకున్న తమన్నా భాటియా నేడు సైబర్ పోలీస్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉండగా, ఆమె విచారణకు హాజరు కాలేదు.
విచారణకు రాలేనన్న తమన్నా
తను షూటింగ్ కు సంబంధించి బయట ఉన్న కారణంగా రాలేకపోయానని నటి తమన్నా భాటియా తన లాయర్ ద్వారా సమాచారాన్ని పంపించారు. విచారణకు హాజరు కావడానికి తనకు సమయం ఇవ్వాలని, మరో తేదీ కేటాయించాలని తమన్నా కోరారు. విచారణకు హాజరు కావడానికి తను ముంబైలో లేనని తమన్నా భాటియా వెల్లడించారు.

అక్రమ ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసులో సెలబ్రిటీలకు నోటీసులు
మహదేవ్ బెట్టింగ్ యాప్ ఇతర యాప్ ఫెయిర్ ప్లే 2023 ఐపీఎల్ ని ప్రసారం చేసిందని, దానివలన తమకు 100 కోట్ల వరకు నష్టం వచ్చిందని వయాకామ్ సంస్థ సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో, పోలీసులు ఈ కేసులో సంబంధం ఉందని అనుమానిస్తున్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
ఇక ఈ వ్యవహారంలో తమన్నా ఫెయిర్ ప్లే ని ప్రమోషన్ చేశారు. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయడం కోసం రావాలని సమన్లు పంపించారు. పోలీసులు ఈ కేసులో నటి తమన్నాను సాక్షిగా మాత్రమే విచారించడానికి పిలిచారు. ఈ కేసులో సైబర్ పోలీసులు ఇప్పటికే బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు
40 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించిన సైబర్ పోలీసులు శనివారం చత్తీస్గడ్ నుండి ఆయనను అరెస్ట్ చేశారు.అంతేకాదు ఈ కేసులో రాపర్ బాద్షా వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. నటుడు సంజయ్ దత్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులను సైతం విచారణకు పిలిచారు. ఇక గత సంవత్సరం ఈ కేసులో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ లను కూడా విచారించారు.
ఐపీఎల్ కాపీరైట్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం
ఐపీఎల్ కాపీరైట్స్ అక్రమ స్ట్రీమింగ్ కేసులో జరుగుతున్న విచారణలో భాగంగా 2023 డిసెంబర్లో ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ తో కలిసి పనిచేసిన ఒక ఉద్యోగిని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications