Adani Group: అమెరికా ఆరోపణలు తోసిపుచ్చిన అదానీ గ్రూప్-కీలక ప్రకటన ..!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీతో పాటు గ్రూప్ లోని మరికొందరు కీలక వ్యక్తులపై అమెరికా న్యాయశాఖ మోపిన 259 మిలియన్ డాలర్ల లంచం, మోసం ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అమెరికాలో సోలార్ కాంట్రాక్టులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై గౌతం అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతరులపై న్యూయార్క్ కోర్టు తాజాగా అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటు గౌతం అదానీ అరెస్టుకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అదానీ గ్రూప్ స్పందించింది.
అదానీ గ్రూప్ పై అమెరికా ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిరాధారమని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా కోర్టు అభియోగాల నమోదుపై స్పందిస్తూ.. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటిని అలా మాత్రమే చూడాలని కోరింది. కార్పొరేట్ గవర్నెన్స్ , పారదర్శకత యొక్క అత్యున్నత ప్రమాణాలను తాము దృఢంగా నిర్వహించినట్లు గ్రూప్ తెలిపింది. అమెరికా కోర్టు అభియోగాలపై చేపట్టాల్సిన చట్టపరమైన చర్యలను పరిశీలించాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది.

అమెరికా న్యాయశాఖ పేర్కొన్నట్లుగా అరోపణ పత్రంలో ఆరోపణలు ఆరోపణలు మాత్రమేనని, దోషులుగా రుజువు చేయబడే వరకు నిందితులు నిర్దోషులుగానే ఉంటారని అదానీ గ్రూప్ తెలిపింది. దీన్ని ఎదుర్కొనేందుకు సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. అదానీ గ్రూప్ తన కార్యకలాపాల యొక్క అన్ని అధికార పరిధిలో పాలన, పారదర్శకత, నియంత్రణ సమ్మతి యొక్క అత్యున్నత ప్రమాణాలను ఎల్లప్పుడూ సమర్థిస్తుందన్నారరు. వాటికి కట్టుబడి ఉందన్నారు. తమది చట్టాన్ని గౌరవించే సంస్థ అని, అన్ని చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉందని తమ వాటాదారులకు, భాగస్వాములకు , ఉద్యోగులకు హామీ ఇస్తున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications