Aditya L1.. ఇప్పుడు ఎక్కడ ఉందంటే..?!
బెంగళూరు: సూర్యుడిపై సరికొత్త ప్రయోగాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1పై మొట్టమొదటి అప్‌డేట్ వెలువడింది. ప్రస్తుతం భూ కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం అనంతరం దాని భూకక్ష్యను మార్చడం ఇదే తొలిసారి.
ఈ ఉదయం 11: 45 నిమిషాల సమయంలో తొలిసారిగా ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో కక్ష్యను మార్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని పనితీరు సంతృప్తికరంగా ఉందని, ప్రయానం సజావుగా సాగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 భూమికి 22,459 కిలోమీటర్ల దూరంలో ఆదిత్య ఎల్1 పరిభ్రమిస్తోంది. ఈ నెల 5వ తేదీన మరోసారి కక్ష్యను మార్చతుంది ఇస్రో.

ఆదిత్య ఎల్1 భూమి చుట్టూ పరిభ్రమిస్తూ.. క్రమంగా తన కక్ష్యను మార్చుకుంటూ సూర్యుడి దిశగా దూసుకెళ్తుంది. ఈ ఉపగ్రహం భూకక్ష్యలోనే ఇంకో 16 రోజుల పాటు సంచరిస్తుంది. లాగ్రాంజ్ పాయింట్ 1లో ప్రవేశపెట్టడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కనీసం అయిదుసార్లు ఈ శాటిలైట్ కక్ష్యను మార్చాల్సి ఉంటుంది. ఎల్1 నుంచి సూర్యుడిపై అధ్యయనం చేస్తుంది ఈ శాటిలైట్.
ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశించిన ఎల్1 పాయింట్‌కు చేరుకోవడానికి ఈ ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. శనివారం ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్షే ప్రయోగ కేంద్రం నుంచి ఆదిత్య శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ- సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
దీని తరువాత గగన్‌యాన్ ప్రయోగాన్ని చేపట్టబోతోన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. మానవ సహిత ప్రయోగం ఇది. మనుషులను అంతరిక్షంలోకి పంపించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్. 2024 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గగన్‌యాన్‌కు సంబంధించిన ప్రయోగాలు శరవేగంగా సిద్ధమౌతున్నాయి.












Click it and Unblock the Notifications