కులగణనపై సుప్రీంలో అఫిడవిట్.. బీజేపీ సర్కార్ యూటర్న్.. మోదీజీ.. ఏ క్యాహై!
దేశవ్యాప్తంగా కులగణన విషయంలో బిజెపి, కాంగ్రెస్ ల మధ్య క్రెడిట్ వార్ కొనసాగుతుంది. కుల గణన చేపడుతున్న ఘనత మాదంటే మాది అంటూ రెండు పార్టీలు ప్రచ్చన్న సమరానికి శ్రీకారం చుట్టాయి. తాజాగా దేశంలో జనాభా లెక్కలతో పాటు, కులగణన చేపడుతున్నట్లు కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రకటించడంతో మోడీ సర్కార్ యూటర్న్ పాలిటిక్స్ పైన కాంగ్రెస్ ఆధారాలతో మరోమారు టార్గెట్ చేసింది.
కుల గణనపైన మోదీ సర్కార్ యూటర్న్
కుల గణన అంశంలో మోదీ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుందని ఆకస్మికంగా యూటర్న్ తీసుకుంది అని చెప్పటానికి తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాం రమేష్ పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 28న జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో కుల గణనను డిమాండ్ చేస్తున్న వారంతా అర్బన్ నక్సలైట్ లు అని ప్రధాని నరేంద్ర మోదీ సంబోధించారని ఆయన పేర్కొన్నారు.

2021లో కులగణనను నిర్వహించబోమన్న బీజేపీ సర్కార్
కుల గణన పైన తమ మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఒత్తిడి నేపథ్యంలోనే ప్రధాని యూటర్న్ తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు.ఇదే సమయంలో గతంలో సుప్రీంకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ను ప్రస్తావించారు. 2021లో కులగణనను నిర్వహించబోమని, ఇది తమ విధాన నిర్ణయమని బిజెపి పేర్కొందని, అప్పుడు పార్లమెంట్లో ప్రభుత్వ సమాధానంగా ఈ విషయాన్ని చెప్పారని జైరామ్ రమేష్ పేర్కొన్నారు.
సుప్రీం కోర్టులో కుల గణనకు వ్యతిరేకంగా కేంద్రం అఫిడవిట్
ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కులగణనను ఆదేశించవద్దని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తూ కేంద్రం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని, నాడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ను ప్రస్తావించారు. ఈ రుజువు చాలదా.. కులగణన పైన కేంద్రం వైఖరిని స్పష్టం చేయడానికి అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు ఈ మార్పు ఎలానో ప్రజలకు చెప్తారా?
ఇదే సమయంలో ప్రధాని యూటర్న్ తీసుకున్నారని, ఈ ఆధారాలతో నైనా ఒప్పుకుంటారా అంటూ జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ఇక కుల గణనపైన ఎస్సీ, ఎస్టీలనుతప్ప, మిగతా కులాలను లెక్కించ కూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు మోడీ ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపిందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేసిందని పేర్కొని ప్రస్తుత ప్రభుత్వ విధానంలో మార్పుకు గల కారణాలను మోదీ ప్రజలకు వివరిస్తారా అంటూ జయరామ్ రమేష్ ప్రశ్నించారు.
కుల గణన క్రెడిట్ మనదే.. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి చెప్పాలన్న కాంగ్రెస్
కేంద్రం తీసుకున్న కులగణన విధానం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే జరిగిందని ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి దక్కుతుందని రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. కులగణన నిర్ణయానికి బిజెపి వ్యతిరేకమని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలని పేర్కొంది. అన్ని ఆధారాలతో బీజేపీని ఇరకాటంలో పెట్టాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications