ఆఫ్ఘన్ ప్రభుత్వం సంచలన ప్రతిపాదన... తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధం... ఆ షరతుకు ఒప్పుకుంటే...
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా,నాటో దళాల నిష్క్రమణ తర్వాత అక్కడ తాలిబన్ల అరాచకానికి అడ్డూ,అదుపు లేకుండా పోయింది. ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా అంతులేని హింసకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలు ప్రావిన్సులను ఆక్రమించిన తాలిబన్లు.. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నగరానికి అతి దగ్గరగా చేరుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఇక తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయినట్లేనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఖతార్‌లోని దోహాలో ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధులకు,తాలిబన్ ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి.
తాజా చర్చల్లో ఆఫ్ఘన్ ప్రభుత్వం ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. తాలిబన్లను హింసను పక్కనపెడితే... వారితో అధికారాన్ని పంచుకోవడానికి తాము సిద్ధమని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధులు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనపై తాలిబన్ ప్రతినిధుల ప్రతిస్పందన ఏంటనేది ఇంకా తెలియరారలేదు. ఇప్పటికైతే ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ఆక్రమణ కొనసాగుతూనే ఉంది. కాబూల్ నగరానికి 150కి.మీ దూరంలో ఉన్న ఘాజ్నీ నగరాన్ని గురువారం(ఆగస్టు 12) తాలిబన్లు ఆక్రమించారు. ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఘాజ్నీ నగరం కాబూల్-కాందహార్ హైవేని ఆనుకుని ఉంటుంది. కాబూల్ నగరానికి దక్షిణాదిన ఉన్న ఆఫ్ఘన్ నగరాలకు ఇది అనుసంధానంగా ఉంటుంది.

ఇప్పటికే తొమ్మిది ప్రావిన్సుల రాజధానులను తాలిబన్లు ఆక్రమించేశారు. దీంతో దేశంలో సగం కన్నా ఎక్కువ భాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్లను నియంత్రించడంలో నిస్సహాయంగా మిగిలిపోతున్న పరిస్థితి నెలకొంది. పలుచోట్ల సైనికులు ప్రాణభయంతో పారిపోతున్న వీడియోలను తాలిబన్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. కాందహార్ సెంట్రల్ జైలుపై దాడి చేసిన తాలిబన్లు... వందలాది తాలిబన్ ఖైదీలను విడుదల చేశారు. తాలిబన్ల అరాచకాలతో అక్కడి ప్రజల జీవితాలు అత్యంత దయనీయంగా మారాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారు. సరిహద్దులు దాటి ఇతర దేశాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌ను పట్టి పీడిస్తున్న తాలిబన్,అల్‌ఖైదా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు రెండు దశాబ్దాల క్రితం అమెరికా,నాటో దళాలు ఆఫ్ఘన్ గడ్డపై అడుగుపెట్టాయి. అప్పటినుంచి ఉగ్రవాదులతో ఆ సైన్యం పోరు జరుపుతూనే ఉంది. ఓవైపు సాయుధ పోరు జరుపుతూనే మరోవైపు తాలిబన్లతో చర్చలపై అమెరికా దృష్టి సారించింది. ఫలితంగా గతేడాది మే 1న దోహాలో అమెరికా,తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 11వ తేదీలోగా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. కానీ అంతకు రెండు నెలలు ముందు గానే అక్కడి నుంచి అమెరికా,నాటో దళాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించాయి. అమెరికా తమ దళాలను ఉపసంహరించుకోవడమే ఆలస్యం తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబూల్ నగరం కూడా వారికి చిక్కితే ఇక ఆఫ్ఘన్ పూర్తిగా వారి నియంత్రణలోకి వెళ్లినట్లే.












Click it and Unblock the Notifications