పదేళ్ల తర్వాత మాట్లాడే పిఎం: అమిత్, హుడాపై సెటైర్
హర్యానా: పదేళ్ల తర్వాత దేశానికి మాట్లాడే ప్రధాని వచ్చారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని గత పదేళ్ళపాటు నడిపిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ తన హయాంలో జరిగిన అవినీతిని అరికట్టలేకపోయారని ఆరోపించారు.
యుపిఏ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగినా మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండిపోయారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మంగళవారం రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా(కాంగ్రెస్)పైనా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

హర్యానా ఒక బలవంతుల, ధైర్య వంతుల భూమి అని చెప్పిన అమిత్ షా.. ఇలాంటి భూమికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఢిల్లీ దర్బారులో నృత్యాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఉద్దేశించి దర్బార్ అనే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బిజెపి గుర్తయిన కమలానికి ఓటు వేసి ఇటలీ సోనియాకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
హర్యానాలో 2005 నుంచి కాంగ్రెస్ పాలనే కొనసాగుతోంది. కాగా, అక్టోబర్ 15న ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన నాలుగు రోజులకు ఫలితాలు వెలువడనున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలోని 8 ఎంపీ స్థానాలకు గానూ 7 ఎంపీ స్థానాలను బిజెపి కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కూడా మోడీ మానియా పనిచేసి హర్యానాలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకంతో రాష్ట్ర శ్రేణులు ముందుకెళ్తున్నాయి.












Click it and Unblock the Notifications