38 ఏళ్ల నిరీక్షణకు తెర: 'ఆపరేషన్ పవన్' వీరులకు భారత సైన్యం సత్కారం!
భారత సైన్యం తొలిసారిగా 'ఆపరేషన్ పవన్'లో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అధికారికంగా సత్కరించనుంది. దేశ స్వాతంత్య్రం తర్వాత భారత్ చేపట్టిన మొట్టమొదటి విదేశీ సైనిక చర్య ఇది. 1987 నుంచి 1990 మధ్య శ్రీలంకలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 1,171 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. మరో 3,500 మందికి పైగా గాయపడ్డారు.
ఇంతవరకు ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కోసం ఎలాంటి అధికారిక స్మారకోత్సవాలు జరపలేదు. ప్రతీ ఏడాది కొద్దిమంది మాజీ సైనికులు, వితంతువులు, వారి కుటుంబాలు మాత్రమే ప్రైవేట్‌గా స్మారక చిహ్నాల వద్ద నివాళులర్పించేవారు. కానీ ఈసారి భారత సైన్యం స్వయంగా ముందుకు వచ్చి అమరవీరులను గౌరవిస్తోంది.

వాస్తవానికి, 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆపరేషన్ పవన్‌ను ప్రారంభించింది. శ్రీలంకలోని తమిళులు, సింహళీయుల మధ్య జరిగిన అంతర్యుద్ధాన్ని అణచివేయడానికి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (IPKF) ను అక్కడికి పంపింది. ఎల్‌టీటీఈతో సహా తమిళ మిలిటెంట్ గ్రూపులను నిరాయుధపరచి శాంతిని పునరుద్ధరించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.
అయితే ఎల్‌టీటీఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత బలగాలతో తీవ్రంగా పోరాడింది. దట్టమైన అడవులు, పొదలలో దాక్కుని దాడులు చేయడంతో అనేకమంది సైనికులు తమ సహచరుల మృతదేహాలను కూడా వెనక్కి తీసుకురాలేకపోయారు. ఈ ఆపరేషన్‌లో అమరులైన వారిలో పరమవీర చక్ర గ్రహీత మేజర్ రామస్వామి పరమేశ్వరన్ కూడా ఉన్నారు. ఆయన 1987 నవంబర్ 25న వీరమరణం పొందారు.
ఈ ఏడాది నవంబర్ 26న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్‌తో కలిసి నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తారు. ఆపరేషన్ పవన్‌లో పాల్గొన్న అనేకమంది మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
శ్రీలంకలో కొలంబోలో ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం ఉన్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ఇంతకాలం అధికారికంగా ఎలాంటి స్మారక దినం నిర్వహించలేదు. అయితే 38 సంవత్సరాల తర్వాత తమ త్యాగాలను గుర్తించడం పట్ల ఒక మాజీ సైనికుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం కానుంది.












Click it and Unblock the Notifications