కేజ్రీకి షాక్: ప్రెస్ మీట్ మధ్యలో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ: మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు దినేష్ మోహనియాను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణపై ఆయనను శనివారం అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఎమర్జెన్సీ విధించారని ఆయన ఆగ్రహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం, దాడులు చేయించడం, భయభ్రాంతులను చేయడం, తప్పుడు కేసులు బనాయించడం వంటి చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు.

సంగమ్ విహార్ ఎమ్మెల్యే దినేష్ మోహనియాను పోలీసులు శనివారం అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ఈ విమర్శలు ఎక్కుపెట్టారు. నీటి సంక్షోభంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కొందరు మహిళలపై మోహనియా అనుచితంగా ప్రవర్తించాన్న అభియోగంపై ఢిల్లీ పోలీసు బృందం ఆయనను దక్షిణ ఢిల్లీలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఉండగా అదుపులోకి తీసుకుంది.
మోహనియా ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. నీటి సమస్యపై నిలదీసిన కొందరు మహిళలపై దురుసుగా ప్రవర్తించారని,, బెదరించారని, మహిళల గౌరవాన్ని కించపరిచారని ఈనెల 23న మోహనియాపై కేసు నమోదైంది. శుక్రవారంనాడు తుగ్లకాబాద్ ఏరియాలో 60 ఏళ్ల మహిళను చెంపదెబ్బకొట్టారనే ఆరోపణపై గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌లో మోహనియాపై మరో కేసు కూడా నమోదైంది.

ఈ కేసులు నమోదైన స్థితిలో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు కేజ్రీవాల్ ఆగ్రహానికి కారణమైంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీవీ కెమెరాల ముందున్న దినోశ్ మోహనియాను అరెస్టు చేయించడం ద్వారా మోడీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారంటూ కేజ్రీవాల్ ట్వీట్‌లో ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications