మోడీ ప్రత్యర్ధులకు కొత్త బాస్ ? 5 రాష్ట్రాల ఫలితాలతో మారిన లెక్కలు- ఇక వారి ఆశలు గల్లంతే !
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేయడంలో సక్సెస్ అయిన బీజేపీ.. ఈ సిక్కు రాష్ట్రంలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన ప్రభావం బీజేపీపై భవిష్యత్తులో ఏ మేరకు ఉండబోతోందో తెలియదు కానీ..పంజాబ్ లో ఆ పార్టీ ఓటమి, ఆప్ గెలుపు ప్రభావం మాత్రం కచ్చితంగా పడబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ లో విజయం తర్వాత ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ నుంచి ప్రధాని మోడీకి పెను సవాళ్లు తప్పేలా లేవు.

ప్రత్యర్ధులపై మోడీ పైచేయి
కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నా ఇంకా దేశంలోని పలు రాష్ట్రాలపై పట్టుసాధించడంలో విఫలమవుతున్న బీజేపీని మరోసారీ సార్వత్రిక ఎన్నికల కోసం ప్రిపేర్ చేసే పనిలో ప్రధాని మోడీ బిజీగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే మోడీపై ఈ ఎనిమిదేళ్లలో పోరాడిన చంద్రబాబు, కేసీఆర్, మమత, అఖిలేష్, విజయన్, కేజ్రివాల్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు ఎన్ని సార్లు గెలిచారో అన్నిసార్లు ఓడిపోయారు కూడా. తాజాగా ఐదు రాష్టాల ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో మోడీ మరోసారి ప్రత్యర్ధులపై పైచేయి సాధించినట్లయింది.

కొరకరాని కొయ్యగా కేజ్రివాల్
మోడీ ఇప్పటివరకూ తాను ఎదుర్కొన్న ప్రత్యర్ధుల్లో ఇద్దరిని మాత్రం కొరకరాని కొయ్యలుగా ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. వీరిలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకరైతే తాజాగా పంజాబ్ లో ఆప్ గెలుపుతో షాకిచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరొకరు. ముఖ్యంగా మమతతో పోలిస్తే పక్క రాష్ట్రంలో పెను ప్రభావం చూపడం ద్వారా దేశంలో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల సరసన తన ఆప్ ను నిలిపిన కేజ్రివాల్ ఇప్పుడు మోడీకి కొరకరాని కొయ్యగా కనిపిస్తున్నారు. దీంతో కేజ్రివాల్ ను ఎదుర్కొనేందుకు మోడీ ప్రత్యేక వ్యూహాలు తయారు చేసుకోక తప్పని పరిస్ధితి.

గుజరాత్ లోనూ సత్తా చాటుకుంటే ?
ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో ప్రధాని మోడీతో పాటు బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని కేజ్రివాల్ పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ వరుస పర్యటనలు చేయడం ద్వారా భవిష్యత్ వ్యూహాలు రచించే పనిలో కేజ్రివాల్ బిజీగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్ధితుల్లో లేని కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తాము ఆ స్ధానాన్ని ఆక్రమించాలని కేజ్రివాల్ పట్టుదలగా ఉన్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తే గుజరాత్ లోనూ ఆప్ సత్తా చాటుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే అక్కడ రెండు దశాబ్దాలుగా ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలిగితే ఆప్ జాతీయ పార్టీ అయ్యేందుకు అవకాసం దక్కడంతో పాటు జాతీయస్ధాయిలో కాంగ్రెస్ స్ధానాన్ని ఆప్ అక్రమించడం కూడా అసాధ్యం కాదు.
Recommended Video

మోడీ ప్రత్యర్ధులకు కొత్త బాస్
గతంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ప్రధాని మోడీకి రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న వారిలో యాక్టివ్ గా ఉన్న వారు కొందరే.
వీరిలో కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రివాల్, ఉద్ధవ్ థాక్రే మాత్రమే ప్రస్తుతం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. వీరిలో కేజ్రివాల్ మినహా మిగిలిన నేతలంతా తమ తమ రాష్ట్రాల్లో అధికారం కాపాడుకునే పనిలోనే ఉన్నారు. తమ రాష్ట్రంలో అధికారం కాపాడుకుంటూ పొరుగు రాష్ట్రాల్లో పట్టు సంపాదించుకునేంత సీన్ వీరిలో ఎవరికీ కనిపించడం లేదు. కానీ కేజ్రివాల్ మాత్రం ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లో బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా తన చీపురుతే ఊడ్చేసి అధికారం సంపాదించడమే కాకుండా రాబోయే రోజుల్లో గుజరాత్ లోనూ బీజేపీకి చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మోడీ ప్రత్యర్ధులైన మమత, కేసీఆర్ మాత్రమే కాదు స్టాలిన్, విజయన్, ఉద్ధవ్ థాక్రే వంటి వారు కూడా కేజ్రివాల్ కు ఏదో విధంగా మద్దతివ్వాల్సిన పరిస్ధితి తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications