తండ్రి చేతుల్లో అలా నలిగిపోయా.. ఢిల్లీ మహిళా కమిషన్ ఛీఫ్ స్వాతీ మలివాల్ సంచలనం..
బాల్యంలో తన తండ్రి నుంచి దారుణంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు బీజేపీ నేత ఖుష్బూ తాజాగా ఆరోపించారు.
ఢిల్లీ : బాల్యంలో తండ్రి చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన తమిళనాడు బీజేపీ నేత ఖుష్బూ దారుణ అనుభవాలు తాజాగా కలకలం రేపుతుండగానే... ఢిల్లీ మహిళా కమిషన్ ఛీఫ్ స్వాతీ మలివాల్ సైతం అదే తరహాలో తననూ తండ్రి వేధించినట్లు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిన్నతనంలో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతీ మలివాల్ చెప్పారు. మహిళా కమిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వాతి మలివాల్.. అవార్డు గ్రహీతల పోరాట కథలు తన సొంత పోరాటాన్ని గుర్తుచేశాయని తెలిపారు. తన తండ్రి కూడా తనపై 'లైంగిక వేధింపులకు' ఎలా గురి చేశాడో ఆమె గుర్తుచేసుకున్నారు. తన తండ్రి తనను చాలా కొట్టేవాడని, ఇంటికి రాగానే మంచం కింద దాక్కొనేదాన్నని స్వాతీ మలివాల్ తెలిపారు.

అప్పట్లో తనకు చాలా భయంగా ఉండేదని, ఆ సమయంలో ఇలాంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆడవాళ్లకు ఎలా సాధికారత కల్పించాలా అని రాత్రంతా ఆలోచించేదాన్నని మలివాల్ గుర్తుచేసుకున్నారు. తన జుట్టు పట్టుకుని గోడకు బలంగా కొట్టాడని, కానీ మహిళల సంక్షేమం కోసం పని చేయాలనే తన దృఢ నిశ్చయాన్ని అది మంటగలిపిందని నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు. తన తండ్రితో కలిసి నాలుగో తరగతి వరకూ ఉండేదాన్నని మలివాల్ తెలిపారు.
2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయ్యారు. తర్వాత ఆమె పదవీకాలాన్ని పొడిగించారు. మహిళా కమిషన్ ఛీఫ్ గా మారకముందు ఆమె సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుగా పనిచేశారు. స్వాతి మలివాల్ హర్యానా ఆప్ మాజీ చీఫ్ నవీన్ జైహింద్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వీరు 2020లో విడాకులు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications