Bihar Polls: బీహార్ సీఎం అభ్యర్ధిపై మోడీ ట్విస్ట్-నితీశ్ కు ఝలక్..!
వచ్చే నెలలో రెండు దశల్లో జరగబోతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే అభ్యర్ధి ఎవరన్న దానిపై ఇప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మహాకూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తేజస్వి యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం లేదన్న ప్రచారం మధ్య నిన్న ఆయనకు మద్దతుగా ప్రకటన వెలువడింది. అదే సమయంలో ఎన్డీయే సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్ చేశారు. దీనిపై ప్రధాని మోడీ ఇవాళ స్పందించారు..
బీహార్ లోని సమస్తిపూర్ లో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ ముఖ్యమంత్రి అభ్యర్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా ముఖ్యమంత్రి అభ్యర్ధి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. బీహార్ మొత్తం మరోసారి ఎన్డీయే సర్కార్ అంటోందన్నారు. ఇలా నితీష్ నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం ఇదే తొలిసారి.

అయితే బీజేపీ-జేడీయూ అధికారం నిలుపుకుంటే ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని మాత్రం ప్రధాని చెప్పకపోవడం విశేషం. నిన్న మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించడం, మీ అభ్యర్ధి ఎవరో చెప్పాలంటూ సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ నేరుగా ముఖ్యమంత్రి అభ్యర్ధిపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో నితీష్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

బీహార్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ కు ఆదరణ అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. ఆయన పార్టీ జేడీయూకు తగ్గుతున్న సీట్లే దీనికి నిదర్శనం. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ ఆదరణ కోల్పోతున్న నితీష్ ను ఈసారి ఎన్డీయే సీఎం అభ్యర్ధిగా ప్రకటించకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల్లో మాత్రం నితీశ్ కార్డు వాడుకుని గట్టెక్కాలని భావిస్తున్న బీజేపీ ఇవాళ ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పి విపక్షాల ప్రచారానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది.












Click it and Unblock the Notifications