రాహుల్ రీ ఎంట్రీ కాగానే లోక్ సభ వాయిదా ! తిరిగి బంగ్లా కేటాయింపుపై సస్పెన్స్..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభలో రీ ఎంట్రీ ఇచ్చారు. మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపేసిన నేపథ్యంలో లోక్ సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో తిరిగి రాహుల్ గాంధీ వాయనాడ్ ఎంపీ అయినట్లయింది. ఈ నేపథ్యంలో రాహుల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్ సభ సచివాలయం ఆదేశాల కోసం ఎదురుచూసిన రాహుల్ గాంధీ.. ఇవాళ నోటిఫికేషన్ వెలువడగానే పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరారు. అక్కడ అయన కోసం అప్పటికే ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఎంపీలు, నేతల్ని కలుసుకున్నారు. అలాగే రాహుల్ పై అనర్హత వేటు తొలగిపోవడంతో ఇండియా కూటమికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు రాహుల్ ను కలిసి అభినందనలు తెలిపారు.

అనంతరం లోక్ సభలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానం, మణిపూర్ అంశాలపై అప్పటికే ఆందోళనలు చేస్తున్న ఇండియా కూటమి ఎంపీలతో కలిసి నిరసనలు చేపట్టారు. కాసేపు విపక్ష ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ ఆందోళన చేసిన తర్వాత స్పీకర్ లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. దీంతో మిగతా ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ.. లోక్ సభ బయటికి వచ్చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన బంగ్లాను ఆఘమేఘాల మీద ఖాళీ చేయించిన అధికారులు ఇప్పుడు ఆయన తిరిగి ఎంపీ కావడంతో బంగ్లా కేటాయించక తప్పని పరిస్దితి ఎదురవుతోంది. దీంతో రాహుల్ కు తిరిగి అదే బంగ్లా కేటాయిస్తారా లేక మరో బంగ్లా ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు అధికారుల్ని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications