అరవింద్ కేజ్రివాల్ నోట మోడీ గానం: ప్రశంసలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం తమ పార్టీ ఎమ్మెల్యేను కొనేందుకు రూ. 4 కోట్లు ముట్టజెప్పేందుకు భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత ప్రయత్నించారని ఓ వీడియో విడుదల చేసిన కేజ్రివాల్.. మంగళవారం నరేంద్ర మోడీని పొగడటం గమనార్హం.
హెడ్‌లైన్స్ టుడేలో వచ్చిన కథనం ప్రకారం.. మోడీ ప్రభుత్వంపై దేశ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారని అరవింద్ కేజ్రివాల్ అన్నారు. వారి ఆశలను నెరవేర్చడంలో ప్రభుత్వం కొంత వెనకబడి ఉన్నప్పటికీ.. ప్రజలు తమ ఆశలను మోడీ ప్రభుత్వంపైనే నిలిపారని చెప్పారు.
ద్రవ్యోల్బణం, అవినీతి, ధరలు లాంటి సమస్యలను తీర్చుతారని మోడీపై ప్రజలు విశ్వాసం ఉంచారని.. అయితే ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. అయినా కూడా ప్రజలు నరేంద్ర మోడీకి ఇంకాస్త సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మోడీ దేశంలో ప్రజాదరణ గల నాయకుడని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘అవును. మోడీ నిజానికి చాలా ప్రజాదరణ గల నాయకుడు' అని అరవింద్ కేజ్రివాల్ అన్నారు. గత ఎన్నికల్లో మోడీపై పోటీ చేసినందుకు మీరేమైనా విచారపడుతున్నారా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని అన్నారు. ప్రధాని కావాలనే ఆలోచనతోనే తాను పోటీ చేశానని ప్రచారం జరిగిందని.. అది తప్పని తెలిపారు.
‘నాకు ప్రధాని కావాలనే ఆశయమేమి లేదు. కొత్తగా ప్రారంభించిన పార్టీకి అది సాధ్యం కాదు. వ్యక్తిగతంగానే ఎన్నికల్లో పోటీ చేశాను. తిరిగి నెల రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే తాము పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఆలోచనతోనే నేను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను' అని కేజ్రివాల్ చెప్పారు.
మరో ఆప్ ముఖ్యనేత, అరవింద్ కేజ్రివాల్ సన్నిహితుడు కుమార్ విశ్వాస్ కూడా ప్రధాని మోడీపై సోమవారం ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులు బాగుంటే అతడ్ని ప్రశంసించకుండా ఎలా ఉండగలమని అన్నారు. మన్మోహన్ సింగ్‌తో పోలిస్తే నరేంద్ర మోడీ ఉత్తమ ప్రధాని అని చెప్పారు.












Click it and Unblock the Notifications