వాయుసేనలో అగ్నివీర్ నియామకాలు మొదలు: ప్రధాని మోడీ లాబొరేటరీలో ఎక్స్‌పెరిమెంట్స్
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద నియామకాలు మొదలయ్యాయి. దీనిపై న్యాయస్థానాల్లో పలు పిటీషన్లు విచారణకు ఉన్న దశలో నియామకాల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సైన్యంలో చేపట్టదలచిన నియామకాలకు ఉద్దేశించిన ఈ పథకం పట్ల దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. అల్లర్లు చోటు చేసుకున్నాయి. రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, విధ్వంసానికి పాల్పడ్డారు.

ఢిల్లీ హైకోర్టులో..
తెలంగాణ, బిహార్, పశ్చిమబెంగాల్, హర్యానా.. వంటి పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లపై దాడులు చోటు చేసుకున్నాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చుతూ ఈ పిటీషన్లను వేశారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, బిహార్, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాల హైకోర్టుల్లో పిటీషన్లు విచారణ దశలో ఉన్నాయి. ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్‌లోనూ పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టుకు బదలాయించిన విషయం తెలిసిందే.

అగ్నివీర్ నియామకాలకు..
ఈ దశలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అగ్నిపథ్ పథకం కింద చేపట్టదలిచిన నియామకాల ప్రక్రియను యధాతథంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవ్వాళ వైమానిక దళంలో అగ్నివీరుల నియామకాల ప్రక్రియ మొదలైంది. తొలిదశలో రాత పరీక్షలను నిర్వహిస్తోన్నారు వైమానిక దళాధికారులు. ఉత్తర ప్రదేశ్‌లో రాత పరీక్షలు కొద్దిసేపటి కిందటే మొదలయ్యాయి. అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వందలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
రాహుల్ ఆందోళన..
రాత పరీక్షలు మొదలైన నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. అగ్నివీర్ కింద నియమితులయ్యే వారి భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సైన్యం నుంచి 60,000 మంది పదవీ విరమణ చేస్తోన్నారని గుర్తు చేశారు. వారిలో 3,000 మందికే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తోన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక నాలుగు సంవత్సరాలకోసారి పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసే అగ్నవీరుల పరిస్థితేమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని లాబొరేటరీలో.
ఒక్క సంవత్సరంలోనే 60,000 మంది పదవీ విరమణ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నాలుగేళ్ల సర్వీస్ తరువాత రిటైర్ అయ్యే అగ్నివీరుల భవిష్యత్ ఏమౌతుందని ప్రశ్నించారు. పదవీ విరమణ చేసిన అగ్నివీరులకు ఉద్యోగాలను కల్పించగలుగుతుందా? అని నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనా విమర్శలు గుప్పించారు. ప్రధాని లాబొరేటరీలో ఇలాంటి ప్రయోగాలు కొనసాగుతున్నాయని, దేశానికి మంచిది కాదని చెప్పారు. అటు దేశ భద్రత, ఇటు యువకుల భవిష్యత్ ప్రమాదంలో పడినట్టేనని అన్నారు.












Click it and Unblock the Notifications