థర్డ్ ఫ్రంట్‌కు ఊపిరి: జయలలితతో సిపిఎం పొత్తు
చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని తమిళనాడు అధికార పార్టీ అన్నాడిఎంకె, సిపిఎం పార్టీలు నిర్ణయించాయి. సోమవారం అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సిపిఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు జయలలిత తెలిపారు. ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఊపిరి పోసుకునే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.
ఎన్నికలయ్యాకే తృతీయ కూటిమి ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని జయలలిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. లౌకిక, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐడిఎంకె, సిపిఎంలు సంయుక్తంగా ప్రకటించాయి. కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాయి.

సీనియర్ సిపిఐ నాయకుడు బర్ధన్ మాట్లాడుతూ.. జయలలిత చెప్పినదానికి తాను అంగీకారం తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. తమ సంయుక్త కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తెలిపారు. తమ కూటమి గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడు, పాండిచ్చేరిలో మొత్తం 40 స్థానాలను దక్కించుకుంటామని జయలలిత ధీమా వ్యక్తం చేశారు.
కాగా భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఇప్పటికే తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎండిఎంకెతో కలిసి సంయుక్తంగా పోటీ చేయాలని బిజెపి నిర్ణయించింది. పిఎంకె, తమిళ నటుడు స్థాపించిన డిఎండికె పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకోవాలని తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications