బ్లాక్‌ఫంగస్‌ను కట్టడి చేసేందుకు ఈ మూడు అంశాల్లో జాగ్రత్త వహించాలి: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ముప్పు వచ్చి పడటంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండేందుకు పలు కీలక సూచనలు చేశారు.
బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండేందుకు రణదీప్ గులేరియా మూడు విషయాలను కీలకంగా సూచించారు. ఒకటి.. బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. 2.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నవారు తప్పనిసరిగా బ్లడ్ షుగర్ లెవల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి. 3.. స్టెరాయిడ్స్ ఇచ్చేటప్పుడు, డోసేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

కరోనాతోపాటు నియంత్రణలేని డయాబెటీస్ కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మైకోసిస్ బారినపడే అవకాశం ఉందని రణదీప్ గులేరియా తెలిపారు. 2002లో సార్స్ వచ్చిన సమయంలోనూ మ్యూకోర్మైకోసిస్ వెలుగుచూసిందని చెప్పారు. అయితే, ప్రస్తుతం సెకండ్ వేవ్‌లో కరోనాను నియంత్రించేందుకు ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతున్నారని అన్నారు. ఎక్కువ మోతాదులో ఈ స్టెరాయిడ్స్ ఇస్తున్న కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోయి బ్లాక్ ఫంగస్‌కు దారితీస్తోందని తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. పర్యావరణంలోని శిలీంధ్ర బీజాంశాలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ప్రజలు మ్యూకోమైకోసిస్ బారినపడుతున్నారు. కట్, స్క్రాప్, బర్న్ లేదా ఇతర రకాల చర్మ గాయం ద్వారా ఫంగస్ చర్మంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఇది చర్మంపై అభివృద్ధి చెందుతుంది.
కోవిడ్ -19 నుంచి కోలుకుంటున్న లేదా కోలుకున్న రోగులలో ఈ వ్యాధి కనుగొనబడింది. అంతేగాక, డయాబెటిస్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయని ఎవరైనా ఈ వ్యాధి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, బ్లాక్ ఫంగస్ కారణంగా కొందరు కంటిచూపు కోల్పోవడం, ముఖ భాగంలో ఉబ్బడం లాంటి తీవ్ర పరిణామాలుంటున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి ప్రాణాలను తీస్తోందీ ఫంగస్.












Click it and Unblock the Notifications