ఎయిరిండియా విమానంలో గబ్బిలం: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అంతా సేఫ్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి నేవార్క్ వెళ్లే విమానంలో ఓ గబ్బిలం కలకలం రేపింది. దీంతో గబ్బిలాన్ని గుర్తించిన పైలట్.. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కి సమాచారం అందించారు. ఆ తర్వాత మార్గమధ్యం నుంచే విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి చేర్చారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(ఏజీఐ) నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.20కి ఎయిరిండియా విమానం(ఎయిరిండియా బీ777-300ఈఆర్) బయల్దేరింది. అరగంట ప్రయాణం తర్వాత విమానంలో గబ్బిలాన్ని గుర్తించిన పైలట్.. వెంటనే తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడు.

ఏఐ-105 డీఈఎల్-ఈడబ్ల్యూఆర్ విమానం తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానం క్యాబిన్‌లో ఓ గబ్బిలాన్ని విమాన సిబ్బంది గుర్తించడంతో విమానం తిరిగిరావాల్సి వచ్చింది. ఉదయం 3.55కి విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత వైల్డ్‌లైఫ్ స్టాఫ్‌ను పిలిపించడంతో, వారు ఆ గబ్బిలాన్ని పట్టుకుని తీసుకెళ్లారని డీజీసీఏ అధికారులు మీడియాకు తెలిపారు.
విమానంలో పొగలు వచ్చాయని, బిజినెస్ క్లాస్ ఏరియాలో గబ్బిలం మృతి చెందిందని వెల్లడించారు. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. థర్డ్ పార్టీలతోనే ఇలా క్షీరదాల రాక జరుగుతోందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇక ప్రయాణికులను మరో విమానంలో నేవార్క్ పంపించారు. ఉదయం 11.35 నిమిషాలకు ఆ విమానం నేవార్క్‌లో ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications