ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తప్పిన ముప్పు..! టేకాఫ్ కాగానే ఆయిల్ ప్రెజర్ జీరో..!
ఈ ఏడాది గుజరాత్ లో అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన మర్చిపోకముందే అలాంటిదే మరో ఘటన చోటు చేసుకునే పరిస్ధితి తృటిలో తప్పిపోయింది. ఈసారి కూడా ఎయిర్ ఇండియా విమానమే టేకాఫ్ కాగానే కీలకమైన సాంకేతిక సమస్య ఎదుర్కొంది. అయితే పైలట్ సకాలంలో స్పందించి విమానం కుప్పకూలకుండా చూశాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ తెల్లవారుజామున 3.20కి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777-337 ఈఆర్ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజన్ ఆయిల్ ఒత్తిడి తగ్గిపోతున్నట్లు పైలట్లు గుర్తించారు. ఎడమచేతివైపు ఉన్న ఇంజన్ 2లో ఇలా ఆయిల్ ఒత్తిడి చూస్తుండగానే జీరోకు చేరుకోవడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. దీంతో నిబంధనల ప్రకారం సదరు ఫ్లైట్ ను తిరిగి ఢిల్లీకి మళ్లించారు.

చివరికి ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. లేకపోతే పెనుప్రమాదం జరిగి ఉండేది. అనంతరం ఇందులో ప్రయాణికులు, సిబ్బంది పూర్తి సురక్షితంగా ఉన్నట్లు నిర్దారించారు. వెంటనే ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వారు ముంబై వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ ఇంకా స్పందించాల్సి ఉంది. విమానయాన పరంగా ఇంజిన్ ఆయిల్ ఒత్తిడి సున్నాకి తగ్గడం తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇంజిన్ భాగాలను చల్లగా, సజావుగా ఉంచడానికి చమురు అవసరం. తగినంత చమురు పీడనం లేకపోతే ఇవి వేగంగా వేడెక్కడానికి , తీవ్రమైన సందర్భాల్లో ఇంజిన్ వైఫల్యం లేదా మంటలకు దారితీస్తుంది.












Click it and Unblock the Notifications