కంట్రోల్ స్విచ్ఛ్ లోపం.. ఎయిరిండియా విమానం నిలిపివేత
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. పైలెట్ల తప్పిదంతోపాటు పలు సాంకేతిక కారణాల కారణంగా ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా బయల్దేరడానికి కొద్ది గంటల ముందే ఆగిపోయింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ఛ్ లోపం కారణంగా విమానాన్ని నిలిపివేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డీజీసీఏ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.
లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (AI132) విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. అయితే బయల్దేరడానికి ముందు సాధారణ తనిఖీలు నిర్వహిస్తారు. కీలక అంశాల్ని ముందుగా పైలట్లు తనిఖీ చేస్తారు. ఈ క్రమంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో లోపం ఉండటాన్ని పైలట్ గుర్తించి విమానాన్ని నిలిపివేశారు. వెంటనే ఈ అంశంపై విమానం, విడిభాగాల తయారీ సంస్థకు అలాగే డీజీసీఏకు కూడా సమాచారమిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఇటీవల జరిగిన AI- 171 విమాన ప్రమాదానికి కూడా ఇటువంటి ఫ్యూయల్ స్విచ్ లోపమే కారణం అని అనుమానాలు ఉండటంతో ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ప్రస్తుతం ఈ విమానంలోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై విమానయాన సంస్థ ఎయిరిండియా దృష్టి పెట్టింది. గతంలోనే తమ విమానాలన్నింటిలో ఫ్యూయల్ స్విచ్ లను తనిఖీ చేశామని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఇక గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 260 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications