Ayodhya verdict: సోదర భావాన్ని పెంపొందించే తీర్పు: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా మౌల్వీ దీవాన్..!
జైపూర్: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై శనివారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అజ్మీర్ దర్గా పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి వివాదానికి సుప్రీంకోర్టు తెర దించిందని అన్నారు.
ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో నలుగుతూ వచ్చిన చారిత్రాత్మక కేసును మెజారిటీ ప్రజలకు సానుకూలంగా ముగింపు ఇచ్చిందని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పునకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించారు. దేశంలో మత సామరస్యాన్ని చాటి చెప్పడానికి ఇదే సరైన సమయమని అన్నారు.

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సారథ్యంలోని అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం హిందువులకు అనుకూలంగా తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అజ్మీర్ దర్గా ప్రధాన మౌల్వీ దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ స్పందించారు.
దేశంలో సోదర భావాన్ని మరింత పెంపొందించేలా సుప్రీంకోర్టును తీర్పును ఇచ్చిందని చెప్పారు. దీనికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలను సుప్రీంకోర్టు గౌరవించిందని, చారిత్రాత్మక సాక్ష్యాధారాల ఆధారంగానే తీర్పు వచ్చిందని చెప్పారు.

సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని జైనుల్ అబెదిన్ వ్యాఖ్యానించారు. సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించడం మంచిదేనని చెప్పారు.
లౌకిక వాదానికి, మత సామరస్యానికి భారత్ చిరునామాగా ఉందని, ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమనే చూస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అశాంతియుత వాతావరణనాకిి ఏ ఒక్కరూ కారణం కాకూడదని చెప్పారు. చారిత్రాత్మక ఘట్టం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. అది దేశ ప్రతిష్ఠను ప్రపంచ దేశాల్లో దిగజార్చుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications