మరోచరిత్ర: రాజస్ధాన్ పాఠ్యపుస్తకాల్లో అక్బర్ కన్నా మహారాణా ప్రతాపే 'గ్రేట్'
జైపూర్: చరిత్రను మారుస్తూ రాజస్ధాన్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో కొత్త చరిత్రను ప్రచురించినట్లు తెలుస్తోంది. పూర్వకాలం నుంచి చక్రవర్తి అక్బర్‌కు ఉన్న 'గ్రేట్' హోదాను మహారాణా ప్రతాప్‌కు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నానీ ఆలోచనలకు అనుగుణంగా, ఆయన ఇచ్చిన సూచనల మేరకు అధికారులు పాఠ్యపుస్తకాల్లో పాఠాలను మార్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పుస్తకాల్లో 'అక్బర్ కన్నా మహారాణా ప్రతాప్ గ్రేట్' అని చిన్నారులు చదువుకోనున్నారు. ఈ పాఠ్యపుస్తకాలపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, వాసుదేవ్ మాత్రం దీన్ని సమర్ధించుకున్నారు. చరిత్రలో ఒకే ఎరాలో ఇద్దరు 'గ్రేట్'లు ఉండరని అన్నారు.

ప్రస్తుత రాజస్ధాన్‌లో అంతర్భాగమైన ఉన్న మేవార్ రాజధానిగా పరిపాలన సాగించిన మహారాణ ప్రతాప్ రాజపుత్ వంశానికి చెందిన వాడు. మహారాణా ప్రతాప్‌కు 1572లో రాజ్యాభిషేకం జరగ్గా, అంతకు కొన్ని సంవత్సరాల ముందే అక్బర్‌తో సంధికోసం రాజపుత్ వంశీకుడు భర్మాల్ తన కుమార్తె హర్కాబాయి అలియాస్ జోదాను అక్బర్‌కు ఇచ్చి పెళ్లి చేశాడని చరిత్ర చెబుతోంది.
మెఘల్ సామ్రాజ్యం ఆధిపత్యం నుంచి మేవార్ రాజ్యాన్ని కాపాడేందుకు మాహారాణా ప్రతాప్ యుద్ధం చేసినట్లు మన అందరికీ తెలుసు. అక్బర్‌పై యుద్ధం చేసిన మహారాణా ప్రతాప్ 1576, జూన్ 21న ఓటమి చెందినట్లు చరిత్ర చెబుతోంది.
చరిత్రను వక్రీకరించి రాజస్ధాన్ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తుతో ఆడలాడుకుంటోందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపణలు చేశారు. దీంతో పాటు వచ్చే జనవరి నుంచి రాజస్ధాన్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో సూర్య నమస్కారాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications