Akhilesh Yadav : యూపీ అసెంబ్లీలో విపక్ష నేతగా అఖిలేష్-యోగీతో ముఖాముఖీ పోరుకు రెడీ
ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి ఓడిపోయిన అఖిలేష్ యాదవ్.. ఇప్పుడు కొత్త పాత్రలోకి అడుగు పెడుతున్నారు. యూపీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఆయన వ్యవహరించబోతున్నారు. ఈ మేరకు బీజేపీ తర్వాత అత్యధిక స్ధానాలు గెల్చుకుని ప్రధాన విపక్షంగా అవతరించిన సమాజ్ వాదీ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆయన్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో విపక్ష నేతగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులొడ్డినా విజయం సాధించడంలో విఫలమైన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నిరాశపడకుండా భవిష్యత్ వ్యూహాలపై దృష్టిపెడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రస్తుతం ఉన్న ఎంపీ పదవిలో కొనసాగుతారని భావించినా అలా చేయకుండా తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యే పదవిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో యూపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కర్హాల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిలేష్.. అసెంబ్లీలో యాక్టివ్ గా లేకపోవడం కూడా తమ ఓటమికి ఓ కారణంగా భావిస్తున్నారు. దీంతో విపక్ష నేతగా యోగీని ఎదుర్కోవాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఎస్పీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్.. విపక్ష నేతగా కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకూ ఆయన ఎంపీగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా మాత్రమే కనిపించారు. ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా, విపక్ష నేతగా ఆయన కొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో యోగీని ఎదుర్కొనేందుకు తానే సరైన నేతగా భావిస్తున్న అఖిలేష్.. భవిష్యత్తులో సమాజ్ వాదీ పార్టీని పటిష్టం చేయాలంటే విపక్ష నేతగా ఉండాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications