యూపీ ఈవీఎంలపై ఫోరెన్సిక్ దర్యాప్తు: అఖిలేష్ యాదవ్‌కు లేని ఐడియాలు ఇచ్చిన మమత దీదీ
కోల్‌కత: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 403 నియోజకవర్గాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలుపుకొని 273 స్థానాలను గెలుచుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అయిదేళ్ల పదవీ కాలంలో తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఏర్పడలేదనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా బీజేపీ నిరూపించుకోగలిగింది.
Recommended Video

ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు..
అవినీతి రహిత పరిపాలనను అందించడం, శాంతిభద్రతలను కాపాడటం, మహిళలకు రక్షణ కల్పించడం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలకు తోడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఛరిష్మా.. బీజేపీకి విజయానికి కారణాలయ్యాయి. తిరుగులేని మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్న తరువాత- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించారు కమలనాథులు.

మమత సరికొత్త డిమాండ్..
ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తాలను చూసుకున్నారు కూడా. హోలీ కంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ సన్నాహాలు చేస్తోన్న ఈ పరిస్థితుల్లో- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ.. సరికొత్త డిమాండ్‌ను తెరమీదికి తీసుకొచ్చారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.

ఫోరెన్సిక్ టెస్టుకు ఈవీఎంలు..
ఈ ఈవీఎంలపై పోరెన్సిక్ దర్యాప్తు జరిపించాలని, ఈ దిశగా సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేయాలనీ సూచించారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీజేపీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని గెలిచిందని ఆరోపించారు. ఈవీఎంల ద్వారా ప్రజల ఓట్లను బీజేపీ నాయకులు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అందులో అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. వారణాసి, ఆజంగఢ్‌లల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఆమె ఉదహరించారు.

ఎస్పీకి పెరిగిన ఓట్ల శాతం..
అఖిలేష్ యాదవ్ ఓట్ల శాతం భారీగా పెరిగిందని, ఆయన నిరాశకు, నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. 2017 నాటి ఎన్నికల్లో 20 వరకు మాత్రమే ఉన్న సమాజ్‌వాది పార్టీకి ఇప్పుడు 37 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఈవీఎంలల్లో అవకతవకలకు పాల్పడకుంటే ఈ ఓట్ల శాతం మరింత పెరిగి ఉండేదని, ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు.

అందర్నీ కలుపుకెళ్తేనే..
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏను ఎదుర్కొనడానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అందర్నీ కలుపుకొని వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని మమత బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం- అసలైన ప్రజల తీర్పు కాదని, వాస్తవ పరిస్థితులకు భిన్నమని మమత బెనర్జీ చెప్పారు. 2024లో ఆ పార్టీ ఓటమికి ఇది దారి తీస్తుందని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications