up uttarpradesh sand mafia chandrakala akhilesh yadav యూపీ ఉత్తరప్రదేశ్ ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా చంద్రకళ అఖిలేశ్ యాదవ్
అఖిలేశ్ మెడకు 'ఇసుక' ఉచ్చు! టార్గెట్.. వయా కలెక్టర్ చంద్రకళ
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మైనింగ్ ఉచ్చులో చిక్కుకోనున్నారా? ఇసుక తవ్వకాలతో ఆయనకు సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సీబీఐ ఆరోపణలు ఊతమిస్తున్నాయి. మైనింగ్ అక్రమాల్లో అఖిలేశ్ పాత్ర ఉందనేది సీబీఐ వాదన. ఈమేరకు ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశముంది.ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఢిల్లీతో పాటు దాదాపు 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
టార్గెట్ అఖిలేశ్ యాదవ్.. వయా కలెక్టర్ చంద్రకళ తీరుగా కనిపిస్తోంది తాజా వ్యవహారం. అఖిలేశ్ యాదవ్ కు ఈకేసుతో సంబంధాలున్నాయన్న నేపథ్యంలో తొలుత చంద్రకళను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అక్కడ్నుంచి మొదలుపెట్టిన సీబీఐ నజర్ క్రమంగా అఖిలేశ్ వరకు చేరిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

11 మందిపై ఎఫ్‌ఐఆర్..!
యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కోనున్నారు. ఆయనకు కూడా ఇసుక తవ్వకాల అక్రమాలతో సంబంధముందనే సీబీఐ ఆరోపణల నేపథ్యంలో విచారణ ఎదుర్కొనే అవకాశముంది. ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు సీబీఐ అధికారులు. ఐఏఎస్ ఆఫీసర్ చంద్రకళతో పాటు సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్సీ రమేశ్ మిశ్రా, బహుజన సమాజ్‌వాది పార్టీకి చెందిన కీలక నేత సహా పదకొండు మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు శనివారం నాడు యూపీ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో దాదాపు 12 చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.

అఖిలేశ్ పై సీబీఐ నజర్ అందుకేనా..!
2012 నుంచి 2016 మధ్య హమీర్‌పూర్ జిల్లాలో మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. అయితే 2012-17 కాలానికి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేశ్ యాదవ్.. మొదటి ఏడాది (2012-2013) గనుల శాఖను ఎవరికి కేటాయించలేదు. ఆ శాఖకు ఆయనే మంత్రిగా వ్యవహరించారు. అదే సమయంలో అక్రమాలు జరిగాయంటున్న సీబీఐ.. అఖిలేశ్ పాత్ర ఉన్నట్లు ఆరోపిస్తోంది.
అందుకే ఈ కేసుకు సంబంధించి ఆయనను ఇన్వాల్వ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మైనింగ్ అక్రమాలతో సంబంధమున్నవారి ఇళ్లల్లో సోదాలు చేస్తున్న సీబీఐ అధికారులు.. అఖిలేశ్ ను విచారించే ఛాన్సుంది. అదలావుంటే 2013 తర్వాత మైనింగ్ శాఖను గాయత్రి ప్రసాద్ ప్రజాపతికి అప్పగించడంతో ఆయనకు కూడా సమన్లు పంపించి విచారించనున్నారు.

పొత్తుల వార్తలతో డొంక కదులుతోందా?
యూపీ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రకళ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందినవారు. 2008లో ఐఏఎస్‌కు ఎంపికైన అనంతరం యూపీ కేడర్ అధికారిగా నియమితులయ్యారు. మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆమె ఈ - టెండర్ నిబంధనల్ని ఉల్లంఘించారనేది ప్రధాన ఆరోపణ. 2012-14 లో హమీర్‌పూర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన చంద్రకళ అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు సీబీఐ అధికారులు.
కొత్తగా ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే పాతవి పునరుద్ధరించే విషయంలో గోల్‌మాల్ జరిగిందని చెబుతున్నారు. అక్రమ మైనింగ్ కు పచ్చజెండా ఊపేందుకు చంద్రకళతో పాటు ఇతర అధికారులు కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్లు చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీచేస్తాయనే వార్తల నేపథ్యంలో ఇసుక డొంక కదలడం గమనార్హం.