శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్: ఆన్‌లైన్ బుకింగ్, రోజుకు 80 వేల మందికే
తిరువనంతపురం: శబరిమల (Sabarimala) అయ్యప్ప భక్తుల ధర్శనం విషయంలో కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ నిర్ణయం ప్రకటించింది.
రోజుకు గరిష్టంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని సీఎంవో ఒక ప్రకటనలో వెల్లడించింది.

శబరిమల తీర్థయాత్రల సన్నహాలను సమీక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో వెల్లడించింది. మకరవిళక్కు సీజన్‌లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పార్కింగ్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్ నిర్వహణ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం పూర్తయిందని, త్వరలో మరొకటి పూర్త కానున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లనున్నారు. తాజాగా, కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను భక్తులు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.












Click it and Unblock the Notifications