ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్: వాహనదారులు ఈ మార్పులు చేసుకోవాల్సిందే
ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్. ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది కలగకూడదంటే మనం తప్పనిసరిగా ఫాస్టాగ్ 'నో యువర్ కస్టమర్' (కేవైసీ)ని అప్‌డేట్ చేయించుకోవాలి. గత మూడేళ్లలో తీసుకున్న ప్రతీ ఫాస్టాగ్‌కు కేవైసీ తప్పనిసరి. ఐదేళ్ల కంటే పాత ఫాస్టాగ్‌లను రీప్లేస్ చేయించుకోవాల్సిందే.
ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఫాలో అయితే జాతీయ రహదారులపై రాకపోకల సందర్భంగా ఎలాంటి సమస్య ఉండదు.

కొత్త రూల్స్ విషయానికొస్తే..
ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్‌లన్నీ తప్పకుండా వాహన రిజిస్ట్రేషన్ నంబరు, ఛాసిస్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. కొత్తగా వాహనాలు కొనే వారు తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరును మొదటి 90 రోజుల్లోగా అప్‌డేట్ చేయించుకోవాలి. ఈ వివరాలను ఫాస్టాగ్ జారీ చేసే కంపెనీలు వేగవంతంగా వేరిఫై చేసి, డాటాబేస్‌లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్పు చేయాలి.
కేవలం వాహనదారులే కాదు, వారికి ఫాస్టాగ్‌లు జారీ చేసిన కంపెనీలు కూడా ఆగస్టు 1 నుంచి మార్పులను గమనించాలి. మూడేళ్లలోపు ఫాస్టాగ్‌ల కేవైసీని అప్‌డేట్ చేయాలి. ఐదేళ్ల కిందటి ఫాస్టాగ్‌లను రీప్లేస్ చేయాలి. అక్టోబరు 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనివల్ల ఆయా ఫాస్టాగ్ హోల్డర్లకు టోల్ ప్లాజాల వద్ద నిరంతరాయ సేవలు అందుతాయి.
ఫాస్టాగ్ జారీ చేసే కంపెనీలకు వాహనదారులు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడి సమాచారాన్ని అందించాలి. వాహనం ముందు భాగం, వెనుక భాగానికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలను ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్‌కు అందించాలి. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని గుర్తించడం సులభమవుతుంది. ప్రతీ ఫాస్టాగ్ ఒక ఫోన్ నంబరుతో కనెక్ట్ అయి ఉంటుంది. దానికే మెసేజ్‌లు, అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు వెళ్తాయి. అక్టోబరు 31 వరకు గడువు ఉంది కదా అని వాహనదారులు ఎదురుచూడకుండా.. సాధ్యమైనంత త్వరితగతిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను సులభతరం చేయడం కోసం, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి 2019లో తీసుకొచ్చిన తనిఖీ వ్యవస్థే ఫాస్టా గ్. ఈ వ్యవస్థను 2019 సంవత్సరంలో కేంద్ర రవాణాశాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నిర్వహిస్తోంది. ఫాస్టాగ్ వ్యవస్థ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ చెల్లింపులను సులభతరం చేస్తోంది. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచే సమయం చాలా తగ్గింది.












Click it and Unblock the Notifications