దూరవిద్య ఇంజినీరింగ్ చెల్లదు: సుప్రీం కీలక తీర్పు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్య (కరస్పాండెన్స్ కోర్సులు) విధానం ద్వారా ఇంజినీరింగ్ వంటి సాంకేతిక కోర్సులను అందించకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Recommended Video

న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్య (కరస్పాండెన్స్ కోర్సులు) విధానం ద్వారా ఇంజినీరింగ్ వంటి సాంకేతిక కోర్సులను అందించకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె.గోయల్, జస్టిస్ యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నాలుగు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు దూర విద్య ద్వారా అందించిన డిగ్రీలను రద్దు చేసింది.
జేఆర్‌ఎన్ రాజస్థాన్ విద్యాపీఠ్ (జేఆర్‌ఎన్), రాజస్థాన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ (ఏఏఐ), తమిళనాడులోని వినాయక మిషన్ రీసెర్చి ఫౌండేషన్ సంస్థలు 2001 నుంచి ఇచ్చిన డిగ్రీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ డిగ్రీలను వెనక్కి తీసుకొని, రద్దు చేయాలని ఆదేశించింది. ఆ డిగ్రీల ద్వారా సంబంధిత అభ్యర్థులకు ఇచ్చిన పదోన్నతులను ఉపసంహరించుకోవాలని, ఆర్థిక ప్రయోజనాలను తిరిగి వసూలు చేయకూడదని సూచించింది. అభ్యర్థులు చెల్లించిన బోధన రుసుము, ఇతరత్రా సొమ్మును మే 31లోగా తిరిగి చెల్లించాలని విద్యా సంస్థలను ఆదేశించింది.

పాత తేదీలతో వర్తించే విధంగా ఈ నాలుగు సంస్థలకు డీమ్డ్ విశ్వవిద్యాలయాల హోదా కల్పించిన యూజీసీ అధికారులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. అలాంటి సంస్థలు 'విశ్వవిద్యాలయం' అన్న పదాన్ని ఉపయోగించుకోకుండా నిషేధిస్తూ నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, డీమ్డ్ విశ్వవిద్యాలయాల వ్యవహారాల పరిశీలనకు నెల రోజుల్లో త్రిసభ్య సంఘాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ కమిటీలో జాతీయ స్థాయిలో విద్య, పరిపాలన, పరిశోధన, న్యాయ రంగాల్లో పేరు పొందిన నిపుణులను నియమించాలని సూచించింది. పర్యవేక్షక, నియంత్రణ కమిటీల ఏర్పాటు తదితర అంశాలను 6 నెలల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. నివేదిక అందిన నెలరోజుల్లో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది. వచ్చే ఏడాది ఆగస్టు 31లోగా ప్రమాణ పత్రం సమర్పించాలని సూచించింది. వీటన్నింటిపై వచ్చేఏడాది సెప్టెంబరు 11న విచారణ జరపనున్నట్టు వెల్లడించింది.
కాగా, 2001-2005 బ్యాచ్ విద్యార్థులకు కాస్త వూరట కలిగించేలా నిర్ణయం తీసుకొంది. వారు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్-ఏఐసీటీఈ) నిర్వహించే రాత పరీక్షలు, ప్రయోగాలకు హాజరై ఉత్తీర్ణులయితే పట్టాలు ప్రదానం చేయవచ్చని తెలిపింది. ఈ విషయంలో విద్యార్థులకు రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఈ పరీక్షలు రాయడం ఇష్టం లేని వారికి ఆయా విద్యాసంస్థలు వారు చెల్లించిన సొమ్మును వాపసు చేయాలి. పరీక్షలు రాయాలా? వద్దా? అన్న నిర్ణయం తీసుకునేందుకు విద్యార్థులకు జనవరి 15 వరకు గడువు ఇచ్చింది.
అంతేగాక, 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఏఐసీటీఈ అనుమతి లేకుండా ఎలాంటి దూరవిద్య కోర్సులను కూడా నిర్వహించకూడదని అన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. దూర విద్య ద్వారా కోర్సులు బోధించవచ్చని సంబంధిత అధికారులు అనుమతించినప్పుడు, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయని అధికారులు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే నిర్వహణకు వీలుందని తెలిపింది. ఒక్కో కోర్సు వారీగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications