All England Championships 2021: సెమీ ఫైనల్లోకి పీవీ సింధు... క్వార్టర్స్‌లో ఉత్కంఠభరిత విజయం
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2021 సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం(మార్చి 19) బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కి చెందిన స్టార్ షట్లర్ అకెన్ యమగుచిపై సింధు విజయం సాధించింది. 76 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో యమగుచిపై సింధు 16-21,21-16,21-19 తేడాతో గెలుపొందింది.
శనివారం(మార్చి 20) జరిగే సెమీ ఫైనల్లో థాయిలాండ్ షట్లర్ చోచువాంగ్‌తో పీవీ సింధు తలపడనుంది. ఈ ఏడాది వరల్డ్ టూర్ ఫైనల్స్ (డబ్ల్యూటీఎఫ్) టోర్నీలో భాగంగా జరిగిన గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో చోచువాంగ్‌ను పీవీ సింధు ఓడించిన సంగతి తెలిసిందే. అయితే తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిన కారణంగా ఆ టోర్నీ నుంచి సింధు నిష్క్రమించక తప్పలేదు. ఇప్పటివరకూ ఈ ఇద్దరు ఐదు మ్యాచ్‌లలో తలపడగా 4-1తో సింధుదే పైచేయిగా ఉంది.తాజాగా ఈ ఇద్దరూ మరోసారి తలపడనుండటంతో ఈసారి ఎవరిది పైచేయి అవుతుందా అన్న ఆసక్తి నెలకొంది.

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించడం సింధు కెరీర్‌లో ఇది రెండోసారి. ప్రస్తుతం ఈ టోర్నీలో సింధు మాత్రమే భారత్ తరుపున సెమీ ఫైనల్ వరకూ వెళ్లగలిగింది. పురుషుల విభాగంలో లక్ష్యసేన్,మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించారు.












Click it and Unblock the Notifications