చర్చలకు సిద్ధంగా లేదు: పాక్ తీరుని తప్పుబట్టిన సుష్మా
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య చర్చలు జరగపోడానికి పాకిస్ధాన్ వైఖరే కారణమని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. భారత్-పాకిస్ధాన్ ఎన్ఎస్ఏ సమావేశం అంశంపై ఢిల్లీలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. పాకిస్ధాన్ కేవలం కాశ్మీర్ అంశంపైనే పట్టుబడుతుందని, అందుకే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు.
ఉగ్రవాదంపై ఇరు దేశాలు ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని భారత్ కోరుకుంటుందని వెల్లడించారు. మే 19న ఉఫాలో భారత్ - పాకిస్థాన్‌ల మధ్య జరిగిన చర్చల్లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు.

ఉఫాలో కుదిరిన ఒప్పందానికి భారత్ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. 2004-2005లోనూ చర్చలు జరిగినట్లు ఆమె గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చలు జరపాలని నిర్ణయించామని వెల్లడించారు. ఉగ్రవాదం ముప్పు లేనప్పుడే చర్చలు సాఫీగా జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications