మోడీ ప్రమాణానికి షరీఫ్, సార్క్ నేతలు: కెసిఆర్ కూడా
న్యూఢిల్లీ: ఈ నెల 26న భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, దక్షిణాసియా దేశాలను ఆహ్వానించారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు సార్క్ దేశాధిపతులు వచ్చే అవకాశముంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా హాజరు కానున్నారు.
తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కోరుతూ మోడీ... కెసిఆర్‌కు ఫోన్ చేశారు. మోడీతో పాటు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కెసిఆర్‌కు ఫోన్ చేసి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందించి, ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఈ నెల 25న కెసిఆర్ ఢిల్లీ వెళతారు. 26న మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ సమస్యలపై చర్చిస్తారు.

మరోవైపు, దేశ ప్రధానిగా మోడీ, సీమాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి వెళ్లలేకపోవచ్చునని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారమే వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మోడీ, బాబు అమలు చేస్తారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. గత పదేళ్లలో ప్రజలకు న్యాయం జరగలేదని అన్నారు.
నరేంద్ర మోడీ బుధవారం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాబోయే ప్రధాని మోడీ రాజీనామా నేపథ్యంలో ఆనందీ బెన్ గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. గుజరాత్ రాష్ట్రానికి నాలుగు దఫాలుగా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications