రాజకీయాలను మలుపు తిప్పే కీలక భేటీ
Delimitation: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.
ఫలితంగా అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాజకీయంగా ఎంతగానో లబ్దిపొందుతాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ విజ్ఞప్తి చేస్తూ వస్తోన్నారాయన కొంతకాలంగా.

లోక్ సభలో మొత్తం సీట్ల సంఖ్య 543. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 129. అంటే 24 శాతం. తెలంగాణ- 17, ఏపీ- 25, కేరళ- 20, తమిళనాడు- 39, కర్ణాటక- 28 స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తరువాత మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 753కు పెరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్న 24 నుంచి 19 శాతానికి పడిపోతుంది.
డీలిమిటేషన్ తరువాత తెలంగాణ- 20, ఏపీ- 28, తమిళనాడు- 41, కర్ణాటక- 36 వరకు సీట్లు పెరుగుతాయి. కేరళలో ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 20 నుంచి 19కి పడిపోయే అవకాశం ఉంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమితంగా ఉంటోంది. ఇదే ప్రాతిపదిక కావడం వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్ సభ సీట్ల సంఖ్య పెరుగుతాయనేది ఆందోళన.
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో నేడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
చెన్నైలోని ఓ హోటల్ దీనికి వేదిక. ఫెయిర్ డీలిమిటేషన్ (Fair delimitation) అనేది ఈ భేటీ ప్రధాన డిమాండ్. దీనికి హాజరు కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ ఆహ్వానించారు స్టాలిన్. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీకి హాజరు కానున్నారు.
డీలిమిటేషన్ ప్రక్రియను రేవంత్ రెడ్డి తప్పుపడుతున్నారు. బీజేపీ-ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇది డీలిమిటేషన్ కాదని, దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయడమేనని ఆరోపించారు. తాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
తమకు ఏనాడూ ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి బీజేపీ ఇదంతా చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ఏకంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మీదే ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని, ఆయన వైఖరిని స్వాగతిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications