ఆ మసీదులో పూజలు చేసుకోవచ్చు... హైకోర్టు సంచలన తీర్పు..!
ఉత్తర్ ప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదులో ఉన్న సెల్లార్ లో పూజలకు అనుమతిస్తూ గతంలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని పక్కనబెట్టేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. సెల్లార్ లో ఓ పూజారి పూజలు నిర్వహించుకోవచ్చని గతంలో వారణాసి స్ధానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో మసీదులో పూజలపై ముస్లిం పక్షానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
జ్ఞానవాపి మసీదు కింద ఓ ఆలయ నిర్మాణం ఉందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా వారణాసి కోర్టు సెల్లార్ లో పూజలకు అనుమతి ఇచ్చింది. ఓ పూజారితో పూజలు చేయించుకోవచ్చని అనుమతి మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. అలహాబాద్ హైకోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకోవాలని సూచించింది. దీంతో గతంలో విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు పూజల్ని సమర్ధించింది.

ఇప్పుడు మరో పిటిషనర్ ఈ పూజల్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. వారణాసి కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేసేందుకు నిరాకరించింది. దీంతో జ్ఞానవాపి మసీదులో నిరాటంకంగా పూజలు సాగబోతున్నాయి. అయితే ఈ కేసులో కోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. గతంలో జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతి ఇవ్వడం 1992లో బాబ్లీ మసీదు కూల్చివేత తర్వాత తెచ్చిన ప్రార్ధనాస్ధలాల చట్టానికి విరుద్దమని పిటిషనర్లు వాదిస్తున్నారు. అయినా కోర్టులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదని ముస్లిం పక్షాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications