అమర్‌నాథ్ యాత్రకు బిగ్ బ్రేక్- మరో యాత్ర కూడా నిలిపివేత: బాల్తల్ వద్దే.. !!
అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. నేటి నుంచి ఈ యాత్రను నిలిపివేశారు అధికారులు. బేస్ క్యాంపుల నుంచి భక్తులు ఎవరినీ కూడా యాత్రకు అనుమతి ఇవ్వట్లేదు. బేస్ క్యాంపుల్లో తమకు కేటాయించిన చోటే ఉండిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అమర్‌నాథ్ తో పాటు ప్రఖ్యాత వైష్ణోదేవి అమ్మవారి యాత్ర కూడా స్తంభించిపోయింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ ఈ రెండింటినీ పునరుద్ధరించబోమని తెలిపారు.
దీనికి కారణం.. అక్కడ కురుస్తోన్న అతి భారీ వర్షాలే. జమ్మూ కాశ్మీర్‌లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ లో భీకర వర్షాలు కురుస్తాయని, ఫలితంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులో కూడిన అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. దీంతో.. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నేటి నుంచే అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలను నిలిపివేశారు.

ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మార్గదర్శకాలు విడుదల చేశారు. జమ్మూ నుంచి కాశ్మీర్ వైపునకు యాత్రీకులను రానివ్వట్లేదు. ఇతర ప్రాంతాల వైపు నుంచి వచ్చే భక్తులు ప్రస్తుతానికి జమ్మూ, ఉధంపూర్, రామ్ బన్‌లలో ఏర్పాటు చేసిన వసతి కేంద్రాల వద్దే తలదాచుకోవాలి. తదుపరి ఆదేశాలు వెలువడిన తర్వాతే వైష్ణోదేవి యాత్రకు అనుమతి లభిస్తుందని ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అలాగే.. బాల్తల్ బేస్ క్యాంప్ లోనే అమర్ నాథ్ యాత్రీకులను నిలిపివేశారు.
బంగాళాఖాతం, అరేబియా సముద్రాల నుంచి వస్తున్న తీవ్ర తేమ గాలుల ప్రభావంతో జమ్మూ కాశ్మీర్‌లో నేటి నుంచి 23 వరకు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రత్యేకించి.. 21 నుంచి 23 మధ్య కాశ్మీర్‌లో అతి భారీ వర్షాలు పడొచ్చని, 20 నుంచి 23 మధ్య జమ్మూ రీజియన్‌లోని రియాసీ, ఉధంపూర్ జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలకు అనుమతి ఇవ్వడం సరికాదని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
పరిస్థితి తీవ్రతను గమనించిన శ్రీ మాతా వైష్ణో దేవి శ్రైన్ బోర్డు సైతం కత్రా బేస్ క్యాంప్ నుంచి యాత్రకు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఆలయం వైపు వెళ్లే మార్గాలను భక్తుల కోసం మూసివేసింది. మరోవైపు.. రాజౌరి జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్థానిక నదులు, వాగుల నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. పలు రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. ఫలితంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు.
పీర్ పంజాల్, గుల్మార్గ్, పహల్గామ్, జోజిలా వంటి కొండ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వరదలు వచ్చే ముప్పు ఎక్కువ ఉన్నందున పర్యాటకులు ఎవరూ ప్రస్తుతానికి అటు వైపు వెళ్ళరాదని అధికారులు కఠిన నిబంధనలు విధించారు. స్థానిక ప్రజలు కూడా నదీ తీరాలకు, ప్రమాదకరమైన లోయల అంచులకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులు కూడా వాతావరణ సూచనలకు అనుగుణంగా ప్రయాణాలు కొనసాగించాలని జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం సూచించింది.














Click it and Unblock the Notifications