వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా: ర్యాన్ డిశాంటిస్ మరొక డోనల్డ్ ట్రంపా? తనపై పోటీ చేయొద్దని ట్రంప్ ఆయనను ఎందుకు హెచ్చరిస్తున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ర్యాన్ డిశాంటిస్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్ ర్యాన్ డిశాంటిస్ రికార్డు స్థాయిలో 15 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయన పోటీ చేయొచ్చనే ఊహాగానాలు కూడా ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి.

మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాల్లో డిశాంటిస్‌ను ''గ్రేట్ విన్నర్’’గా అభివర్ణిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డోనల్డ్ ట్రంప్‌కు ఆయన గట్టిపోటీ ఇస్తారని ఇప్పటికే విశ్లేషణలు మొదలయ్యాయి.

డిశాంటిస్‌కు రాజకీయాలు కాస్త కొత్త. అయితే, 2019లో ఫ్లోరిడా గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోవడంతో ఆయన పేరు వార్తల్లో మార్మోగింది.

మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలకు ముందుగా 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా నిలవొద్దని డిశాంటిస్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తనపై పోటీచేస్తే రిపబ్లికన్ పార్టీకి హాని జరుగుతుందని ఆయన వివరిస్తున్నారు.

''ఆయన తప్పు చేస్తున్నారు. పార్టీ ప్రతినిధులకు కూడా అది నచ్చదు’’అని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ చెప్పారు.

వివాదాస్పద అంశాలైన జెండర్, స్కూళ్లలో జాత్యహంకారంపై శిక్షణ, అబార్షన్లపై డిశాంటిస్ తన వైఖరిని ఎప్పటికప్పుడే కుండ బద్ధలు కొట్టినట్లు చెబుతారు. అలానే దాదాపు అన్ని వర్గాల్లో ఆయన తనకంటూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు.

ర్యాన్ డిశాంటిస్

యేల్ నుంచి గవర్నర్ కార్యాలయం వరకు..

44 ఏళ్ల డిశాంటిస్ అమెరికా రాజకీయాల్లో కాస్త కొత్తవారే. 2012లో ప్రతినిధుల సభకు తొలిసారి ఆయన ఎన్నికయ్యారు. కేవలం ఆరేళ్లలో అంటే 2018లో సెనేటర్‌గా మారారు.

ఫ్లోరిడాలోని జాక్స్‌విల్‌లో 1978లో డిశాంటిస్ జన్మించారు. యేల్ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో ఆయన చదువుకున్నారు. అప్పుడే బేస్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత హార్వర్డ్ లా స్కూలుకు వెళ్లారు.

హార్వర్డ్‌లో రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే అమెరికా నావికాదళ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. నావికా దళంలోని జడ్జి అడ్వొకేట్ జనరల్ (జేఏజీ) కోర్‌లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. గ్వాటనామో బేలో బందీలకు న్యాయ సేవలను చేరువ చేయడం, ఇరాక్‌లో పనిచేస్తున్న అమెరికా నావీ సీల్స్‌కు న్యాయ సలహాదారుగా సేవలు అందిచడం లాంటి విధులను ఆయన నిర్వర్తించారు.

2010లో నావికా దళ సేవల నుంచి డిశాంటిస్ పదవీ విరమణ పొందారు. అప్పుడే తన భార్య కేసీని ఆయన తొలిసారి కలిశారు. అమెరికా స్థానిక టీవీలో న్యూస్ రిపోర్టర్‌గా ఆమె పనిచేసేవారు. ఆమె క్యాన్సర్‌ను జయించారు. 2022లో హరికేన్ లాన్ బాధిలకు ఆర్థిక సాయం సమీకరించడంలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషించారు.

ర్యాన్ డిశాంటిస్

ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా..

నౌకా దళం నుంచి పదవీ విరమణ తీసుకున్న తర్వాత, ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా డిశాంటిస్ పనిచేయడం మొదలుపెట్టారు. 2012లో తొలిసారిగా ఫ్లోరిడా సిక్స్త్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కోసం బరిలోకి దిగారు. ఇది ఫ్లోరిడాలో అత్యంత కన్సర్వేటివ్ సీటుగా చెబుతుంటారు.

ఫ్లోరిడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ''స్మాల్ గవర్నమెంట్’’అనే విధానంతో డిశాంటిస్ ప్రజల్లోకి వెళ్లారు. పన్నులను తగ్గించాలని చెప్పడంతోపాటు ఒబామా యంత్రాంగాన్ని ముక్తకంఠంతో ఆయన వ్యతిరేకించేవారు.

''పిల్లల నడుం చుట్టుకొలతతో మొదలుపెట్టి భూతాపం వరకూ అన్నింటిలోనూ ప్రభుత్వం చేసుకోవడం ఏమిటి’’అని ఆయన ప్రశ్నించేవారు.

''నా మిషన్ మొత్తం బరాక్ ఒబామాను అడ్డుకోవడం చుట్టూనే తిరిగేది’’అని టెక్సస్‌లోని ఒక కన్జర్వేటివ్ కాన్ఫెరెన్స్‌లో ఆయన చెప్పారు. ''అది చాలా మంచి పోటీ. ముఖ్యమైన పోటీ’’అని ఆయన అన్నారు.

2018లో అంటే ఐదేళ్లపాటు క్యాపిటల్ హిల్‌లో పనిచేసిన తర్వాత గవర్నర్‌గా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. అప్పట్లో ఆయనకు అప్పటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మద్దతు సంపూర్ణంగా ఉండేది.

మొత్తంగా 2019 జనవరిలో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

ర్యాన్ డిశాంటిస్

గవర్నర్‌గా డిశాంటిస్ ఎలా పనిచేశారు?

డిశాంటిస్‌కు గవర్నర్‌గా పనిచేస్తున్నప్పుడు తొలి సవాల్ 2020లో కోవిడ్-19 రూపంలో ఎదురైంది. ఏప్రిల్ నాటికి రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఆయన వందలకొద్ది కోవిడ్-19 పరీక్షల కేంద్రాలను ఏర్పాటుచేశారు. లక్షల సంఖ్యలో మాస్కులకు ఆర్డర్లు ఇచ్చారు. ''ఇన్ఫెక్షన్లు అడ్డుకోవడంలో ఇవి సమర్థంగా పనిచేస్తాయి’’అని ఆయన చెప్పారు.

జులై నాటికి నెమ్మదిగా ఆయన ఆంక్షలను ఎత్తివేయడం మొదలుపెట్టారు. అయితే, అప్పటికీ కేసులు పెరుగుతూనే ఉండటంతో ఆయన విమర్శలను మూటకట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆయన విద్యా సంస్థలను కూడా తెరవాలని ఆదేశాలు జారీచేశారు. అయితే, కొందరు ఆయన చర్యలను వెనకేసుకొని వచ్చేవారు.

''కోవిడ్ సమయంలో అందించిన సేవలతో ఆయన పేరు ప్రఖ్యాతులు మరింత పెరిగాయి. చాలా మంది ఆయన చర్యలను

సమర్థిస్తారు’’అని రిపబ్లికన్ వ్యూహకర్త, రిపబ్లికన్ ఓటర్స్ ఎగైనెస్ట్ ట్రంప్ సంస్థ వ్యవస్థాపకురాలు సారా లాంగ్‌వెల్ బీబీసీతో చెప్పారు.

మరోవైపు జనవరి 2021లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు తీసుకునేటప్పుడు ఫాక్స్‌ న్యూస్‌కు డిశాంటివ్ పదునైన విమర్శలతో ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ తర్వాత నుంచి ఆయన చేపడుతున్న ప్రచారాలు, చేస్తున్న వ్యాఖ్యలు.. రిపబ్లిక్ పార్టీ ప్రముఖుల్లో ఒకరిగా ఆయనను నిలబెట్టాయి.

మార్చి 2022లో ''డోంట్ సే గే’’గా పిలిచే బిల్లుపై ఆయన సంతకం చేశారు. ప్రైమరీ స్కూళ్లలో సెక్సువల్ ఓరియెంటేషన్ లేదా జెండర్ ఐడెంటిటీలపై చర్చలను నిషేధించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి.

మరోవైపు 2022లోనే ''ఆఫీస్ ఆఫ్ ఎలక్షన్ క్రైమ్స్ అండ్ సెక్యూరిటీ’’ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఓటింగ్ నేరాలపై విచారణకు ఆయన దీన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఓటింగ్ మోసాలకు పాల్పడిన కొందరిని అరెస్టు కూడా చేశారు.

మరోవైపు అబార్షన్ హక్కులను నిలిపివేస్తూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన తర్వాత.. లక్షల మంది అభ్యర్థనలకు పరిష్కారం లభించింది అని డిశాంటిస్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా ఈ విషయంపై తరచూ ఆయన మాట్లాడేవారు.

మరోవైపు 15 వారాలకు పైబడిన అబార్షన్లను నిషేధిస్తూ ఒక చట్టాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

శరణార్థుల సమస్యను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని కొందరు డిశాంటిస్‌ను విమర్శిస్తుంటారు. అయితే, ఇలాంటి కన్జర్వేటివ్ భావజాలమే ఆయనకు ప్రజాదరణను తెచ్చిపెడుతోందని సారా అభిప్రాయపడ్డారు.

''మీడియా తనను చెడు కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. దాని వల్ల ఆయనను ద్వేషించేవారు పెరుగుతున్నారు. దాన్ని కూడా ఆయన ప్రేమిస్తారు. ఈ విషయాన్ని ఆయన ట్రంప్ నుంచే నేర్చుకున్నారు. మీరు మీడియాకు కోపం తెప్పిస్తే, వారు మీ గురించి ఎక్కువగా మాట్లాడతారు. దాని వల్ల అంతిమంగా మీ అభిమానులు పెరుగుతారు’’అని ఆమె అన్నారు.

తర్వాత ఆయనేనా?

అయితే, ఇప్పటివరకు 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశాన్ని డిశాంటిస్ ఎక్కడా బయటపెట్టలేదు. కేవలం 2022 ఫ్లోరిడా ఎన్నికలపైనే తను దృష్టిపెడుతున్నట్లు ఆయన వివరించారు.

అయితే, కొన్ని ఒపీనియన్ పోల్స్‌ మాత్రం ట్రంప్‌ కంటే డిశాంటిస్ అధ్యక్ష రేసులో ముందున్నారని చెబుతున్నాయి. వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీ ఉంటుందని అంచనా వేస్తున్నాయి.

మిడ్‌టెర్మ్ ఫలితాలకు ముందే, వీరిద్దరి మధ్య విభేదాలు కూడా బయటకు కనిపించాయి. సెనేటర్ మార్కో రుబియో కోసం ఫ్లోరిడాలో ఏర్పాటుచేసిన ర్యాలీకి ట్రంప్‌ను డిశాంటిస్ ఆహ్వానించలేదు. ఆ తర్వాత పెన్సిల్వేనియాలో ఓ కార్యక్రమంలో డిశాంటిస్‌ను ట్రంప్ విమర్శించారు. అదే సమయంలో తను ప్రచారం చేపట్టకపోయినా ఫ్లోరిడాలో ఆయన గెలుస్తారని ట్రంప్ అన్నారు.

ఒకవేళ ట్రంప్ రేసులో లేకపోతే మీరు ఎవరికి ఓటు వేస్తారని ఒక అధ్యయనం చేపట్టినప్పుడు ఎక్కువమంది డిశాంటిస్‌కే మొగ్గుచూపినట్లు సారా చెప్పారు. అయితే, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో ఆయన పోటీ పడగలరో లేదో వేచిచూడాలి.

''ట్రంప్‌తో నేరుగా పోటీపడే శక్తి డిశాంటిస్ ఉందో లేదో నాకు తెలియదు. అయితే, చాలా మంది రిపబ్లికన్ పార్టీ భవిష్యత్ డిశాంటిస్ చేతుల్లోనే ఉందని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఈయన ఎలాంటి విధానాలకు మొగ్గుచూపుతారో మనం ఇంకా చూడాల్సి ఉంది’’అని సారా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
America: Is Ron DeSantis Another Donald Trump? Why is Trump warning him not to run against him?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X