రాహుల్ కు అధికారం అప్పుడే..! విదేశీ టూర్ పై అమిత్ షై పంచ్ లు..!
దసరా పండుగ ముందు వరకూ ఢిల్లీ నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న విపక్ష నేత రాహుల్ గాంధీ ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అధికారం కోసం ఢిల్లీలో ఆందోళనలు సాగిస్తున్న రాహుల్ గాంధీకి ఆ అవకాశం 30 ఏళ్ల వరకూ రాదంటూ అమిత్ షా పంచ్ లు వేశారు. రాహుల్ విదేశీ పర్యటన నేపథ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరసన తెలుపుతున్న తరుణంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై స్పందించిన హోం మంత్రి అమిత్ షా.. ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడు దశాబ్దాల పాటు ఆయన పార్టీ అధికారానికి దూరంగానే ఉంటుందని షా జోస్యం చెప్పారు. యమునా నది ప్రక్షాళన కోసం రూ. 8,941 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన అమిత్ షా.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై వ్యంగాస్త్రాలు సంధించారు.

మీరు విదేశాల్లో ఎక్కడో కూర్చుని ఉన్నారు, నా మాటలు మీకు వినిపించవని నాకు తెలుసు. ఎందుకో కూడా మీరు చెప్పరు, కానీ ఫర్వాలేదు, అది మీ వ్యక్తిగత జీవితం... కానీ మీరు ఢిల్లీలో అడుగుపెట్టాక, నా మాట వినండి; రాబోయే ముప్పై ఏళ్ల వరకు మీ వంతు రాదు," అని రాహుల్ ను ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ లో జరిగిన అవకతవకలకు, అందులో జ్ఞానేష్ కుమార్ పాత్రకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్, కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న తరుణంలో రాహుల్ వియత్నాం టూర్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎప్పటిలాగే రాహుల్ విదేశీ టూర్ పై బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. ఢిల్లీ నిరసనల్లో అబద్ధాలు అరిచీ అరిచీ అలసిపోయిన గాంధీ వారసుడు ..సెలవుపై వెళ్లారని ఆరోపిస్తున్నారు. వియత్నాంకు వెళ్తున్న విమానంలో రాహుల్ వీడియోను ఇప్పటికకే బీజేపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. రాహుల్ విదేశీ పర్యటనల అజెండా ఏంటని కాషాయ పార్టీ ప్రశ్నలు గుప్పిస్తోంది.














Click it and Unblock the Notifications
