నలుగురి ప్రేమలో 9 కోట్లు మోసపోయిన వృద్ధుడు
సైబర్ నేరాల పట్ల ప్రభుత్వాలు ఎంత అలర్ట్ చేస్తున్నా సైబర్ మోసగాళ్ల నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్న పలువురి ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక షాకింగ్ ఉదంతమే తాజాగా వెలుగులోకి వచ్చింది. నలుగురు మహిళల పేరుతో 80ఏళ్ల వ్యక్తి నుండి దాదాపు 9 కోట్ల రూపాయలు కాజేసిన సైబర్ నేరం తాజాగా ముంబైలో వెలుగుచూసింది.. ఇక ఆ వివరాలలోకి వెళితే..
వృద్ధుడిని నమ్మించి మోసం చేసిన మహిళలు
ముంబై కి చెందిన ఒక వృద్ధుడికి 2023 లో షార్వి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఫేస్బుక్లో పరిచయమైన ఆమెతో స్నేహం కొనసాగి, చివరికి వారు రోజు ఫోన్ లో మాట్లాడుకునే వరకు వెళ్ళింది. షార్వి అనే మహిళ తాను భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని బాధితుడిని నమ్మించింది. ఆ తర్వాత ఆయనకు మాయమాటలు చెప్పి పలుమార్లు డబ్బులు వసూలు చేసింది.

వృద్ధుడిని నిదానంగా ట్రాప్ చేసిన మహిళలు
ఇక ఆ తర్వాత షార్వి స్నేహితురాలిని అని చెప్పి కవిత అనే పేరుతో మరొక మహిత మహిళ వృద్ధుడికి పరిచయమైంది. ఆమె కూడా నిదానంగా వృద్ధుడిని నమ్మించి స్నేహంగా ఉంటూ ఆయన నుండి డబ్బులు వసూలు చేసింది. కవితకు కూడా అడిగినప్పుడల్లా సదరు వృద్ధుడు డబ్బులు పంపాడు. ఆ తర్వాత షార్వి కి సోదరి అని చెప్పి దినాజ్ అనే మరొకరు వృద్ధుడికి మెసేజ్ లు పంపించారు.
నలుగురు మహిళలకు అడిగినంత డబ్బు ఇచ్చిన వృద్ధుడు
షార్వి మరణించిందని, ఆమె ఆసుపత్రి బిల్లులు కట్టాలంటూ తప్పుడు ఆధారాలు చూపించి వృద్ధుడి నుండి డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి డబ్బులు తిరిగి ఇవ్వాలని వృద్ధుడు కోరగా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆపై దినాజ్ స్నేహితురాలినని జాస్మిన్ అనే మరొక మహిళ వృద్ధుడికి సందేశాలు పంపించారు. ఆమెతో కూడా సన్నిహితంగా ఉన్న బాధితుడు అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తూ వచ్చాడు.

2023నుండి 734సార్లు డబ్బులు పంపిన వృద్ధుడు
ఇలా 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆ వృద్ధుడు దాదాపు 734 సార్లు డబ్బులు పంపాడు. ఒక్కొక్కసారి డబ్బుల కోసం ఆయన కొన్నిచోట్ల అప్పు కూడా చేసినట్లు సమాచారం ఇలా మొత్తం 8.7 కోట్ల రూపాయలను వృద్ధుడు పోగొట్టుకున్నాడు.
సైబర్ నేరం అని తెలిసి షాక్ లో ఆస్పత్రి పాలైన వృద్ధుడు
ఇక కుటుంబ సభ్యులు డబ్బుల కోసం వృద్ధుడిని నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు . అయితే ఇదంతా సైబర్ మోసం అని తెలుసుకున్న వృద్ధుడు షాక్ కు గురై ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వృద్ధుడికి డిమెన్షియా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications