"అన్న సేవ"తో మొదలైన అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!!
అపర కుబేరుడు ముకేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అన్నసేవ కార్యక్రమంతో ముందస్తు పెళ్లి వేడుకలకు శ్రీకారం చుట్టారు. బుధవారం రాత్రి ఈ వేడుకల ప్రారంభోత్సవానికి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీ సహా కుటుంబసభ్యులు, అలాగే రాధిక మర్చంట్, ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
వారు గ్రామంలోని ప్రజలకు, బంధుమిత్రులకు స్వయంగా భోజనం వడ్డించి అన్న సేవ నిర్వహించారు. సాంప్రదాయ గుజరాతి వంటకాలను గ్రామస్తులకు రుచి చూపించారు. స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ అన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది . దాదాపు 51 వేల మందికి రాబోయే 3 రోజులపాటు అన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

భోజనం చేసిన తర్వాత అతిథులు గుజరాతి సాంప్రదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతి గాయకుడు కీర్తి దాస్ గాధ్వి తన గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. అన్న సేవా కార్యక్రమాలను నిర్వహించడం అంబానీ కుటుంబానికి ఆనవాయితీ. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున ఆహార పంపిణీ చేసి, అన్నార్తులకు అన్న సేవ నిర్వహించింది.
ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1000 మంది ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. వీరందరికీ 2500 రకాల పసందైన వంటకాలతో విందు భోజనాన్ని రుచి చూపించనున్నారు అంబానీ కపుల్. ఇక ప్రీ వెడ్డింగ్ సాంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు భారీగానే జరిగాయి.
గుజరాత్లోని కచ్, లాల్ పురా కు చెందిన మహిళ కళాకారులు తయారు చేసిన సాంప్రదాయ బంధని స్కార్ఫ్ లను అతిథులకు అందించనున్నారు. నిన్న రాత్రి నిర్వహించిన అన్న సేవ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ అక్కడ గ్రామంలోని సామాన్యులకు చేతులెత్తి నమస్కరించి, వారికి స్వయంగా భోజనం పెట్టి, ఆతిధ్యం ఇవ్వడం ప్రధానంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications