• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్: ఏజెన్సీ ప్రాంతాలకు పాకిన కరోనా.. మూఢనమ్మకాలు సమస్యను తీవ్రం చేస్తున్నాయా

By BBC News తెలుగు
|

విశాఖ ఏజెన్సీ

మొదటి వేవ్‌లో నగరాలను, పట్టణాలను చుట్టేసిన కోవిడ్ వైరస్ రెండో వేవ్‌లో గ్రామీణ ప్రాంతాలలో వ్యాపిస్తోంది. చివరకు గిరిజన ప్రాంతాల ప్రజలతో పాటు మావోయిస్టులపైనా కరోనా ఎఫెక్ట్ పడింది.

విజయనగరం జిల్లాలో ఓ ఆర్టీసీ కండక్టర్‌‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అందరూ తనను 'దూరం పెడతారు' అనే భయంతో ఆ విషయం ఎవరికి చెప్పలేదు.

పైగా ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ టీకా వేయించేందుకు ఏర్పాట్లు చేసినా, చనిపోతానన్న భయంతో అది కూడా వేయించుకోలేదు.

ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కానీ, అంతకు ముందు ఆయన వైరస్‌తోనే పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో విధులకు హాజరయ్యారు. వందల మందిని కలిశారు.

విశాఖ ఏజెన్సీలోని ఓ చిన్నగ్రామానికి చెందిన ఓ వ్యక్తిది మరో కథ. ఆయన సెల్‌ఫోన్ ఛార్జర్ కొనుక్కోడానికి ఏజెన్సీలోని ఓ మండల కేంద్రమైన దేవరాపల్లిలో జరిగే సంతకు వచ్చారు. సాయంత్రం వరకు స్నేహితులతో గడిపి తిరిగి స్వగ్రామం వెళ్లారు.

మూడు రోజుల తరువాత ఆయనకు జ్వరం వచ్చింది. తగ్గక పోవడంతో అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. 'పాజిటివ్' రిపోర్ట్ రావడంతో ప్రస్తుతం పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వైరస్ తీవ్రత తెలిసినా తమకేమీ కాదని కొందరు.. లేనిపోని భయంతో మరికొందరు కరోనా నిబంధనలు పాటించక పోవడంతో పల్లె సీమల్లోనూ కరోనా వ్యాప్తి పెరిగింది.

ముఖ్యంగా ఏజెన్సీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని వైద్య సిబ్బంది అంటున్నారు.

గతే ఏడాది ఇన్ని కేసులు రాలేదని...సెకండ్‌ వేవ్‌లో కేసులతోపాటు, మరణాలు కూడా పెరిగాయని ఓ వైద్యాధికారి బీబీసీతో అన్నారు.

విశాఖ ఏజెన్సీ

ఇంటింటా కరోనా కేసులు...

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కరోనా కేసు నమోదు కాని గ్రామం లేదంటే నమ్మాల్సిన పరిస్థితి. విశాఖ ఏజెన్సీలో ఏప్రిల్ 28న కేవలం 45 కేసులు నమోదయ్యాయి.

మే 11వ తేదిన ఒకే రోజు అత్యధికంగా 252 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏడీఎంహెచ్ఓ లీలా ప్రసాద్ చెప్పారు.

ప్రస్తుతం ఏజెన్సీలో మొత్తం 1448 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు చెప్పగా, విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం సన్యాసమ్మ పాలెంలో ఇంటింటా కరోనా బాధితులు ఉన్నారని గ్రామస్థులే స్వయంగా చెబుతున్నారు.

''మా ఊళ్లో 35 మంది వరకు కరోనా బారినపడ్డారు. గత ఏడాది కరోనాతో ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు రెండు రోజుల్లో ఇద్దరు చనిపోయారు.'' అని సన్యాసమ్మ పాలేనికి చెందిన వైకుంఠం బీబీసీతో అన్నారు. ఆయన కూడా కరోనా నుంచి కోలుకుని ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చారు.

విశాఖ ఏజెన్సీ

నగరాల నుంచి ఏజెన్సీ వరకు....

ఆంధ్రప్రదేశ్‌లో 16 వేల గిరిజన గ్రామాలున్నాయని, ఇందులో 2,600 గిరిజన గ్రామాలకు చేరుకోవడం కష్టమని, మరో 800 గ్రామాలకు టూ వీలర్ కూడా వెళ్లదని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి చోట మావోయిస్టుల కార్యకలాపాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలకు కూడా కరోనా పాకుతోంది.

''ఏజెన్సీ వాసులు వివిధ పనులపై మండల కేంద్రాలు, పట్ణణాలు, నగరాలకు వెళ్లి వస్తూ తమకు తెలియకుండానే కరోనాను మోసుకొస్తున్నారు. పట్టణాలకు పోటీగా గిరిజన గ్రామాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.'' అని ఆంధ్రా యూనివర్సిటీ ఆంత్రోపాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యపాల్ బీబీసీతో అన్నారు

''విశాఖ జిల్లాలోని పాడేరు ఐటీడీఏ పరిధిలోని మండల కేంద్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మూరుమూల ప్రాంతాల్లో కేసులు తక్కువే. నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అరకు వ్యాలీ యూత్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం నుంచి వంద పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. కోవిడ్ నిర్థరణలో ఆలస్యం జరక్కుండా ఉండేలా ప్రయత్నిస్తున్నాం'' అని పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వెల్లడించారు.

విశాఖ ఏజెన్సీ

'సెకండ్ వేవ్ చంపేస్తోంది'

ఏజెన్సీలో గత ఏడాది దాదాపు 83 వేల మందికి కరోనా పరీక్షలు జరపగా, వారిలో 2,844 మందికి పాజిటివ్‌గా తేలింది. 14 మంది మరణించారు. కానీ ఈ ఏడాది నెల రోజుల్లోనే 31 మంది మృతి చెందారని ఏడీఎంహెచ్ఓ లీలా ప్రసాద్ చెప్పారు.

''సెకండ్ వేవ్ మొదలయ్యాక సుమారు 26,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 700మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 10 మంది మరణించారు. అయితే ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. కేసులు, మరణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఏజెన్సీ వైద్యశాఖ ఉద్యోగి ఒకరు బీబీసీకి చెప్పారు.

''ప్రభుత్వం ప్రకటిస్తున్న మరణాలన్నీ అవాస్తవం. ఇప్పటికే 50 మంది మరణించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఏజెన్సీలో ప్రతి మండలంలోనూ కోవిడ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.'' అని అరుకు లోయ పెదలబుడు గ్రామ సర్పంచ్ దాసు బాబు అన్నారు.

విశాఖ ఏజెన్సీ

ఏజెన్సీలపై కోవిడ్ పంజా

సాధారణంగా గిరిజనులకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, కానీ విశాఖ ఏజెన్సీ నుంచి కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు వస్తున్న కోవిడ్ బాధితుల శాతం బాగా పెరిగిందని ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ బీబీసీతో అన్నారు..

''గతంలో నగర, పట్టణ ప్రాంతాల కేసులు మొదట్లో 80 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి 20శాతం కేసులు వచ్చేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో 10, ఏజెన్సీ ప్రాంతలో 10 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఈ సీజన్‌లో వచ్చే మలేరియా జ్వరాల కంటే కోవిడ్ జ్వరాలతో బాధపడేవారే ఎక్కువగా ఉంటున్నారు.'' అని డాక్టర్ సుధాకర్ చెప్పారు.

వ్యాక్సినేషన్ వద్దు...ఐసోలేషన్ తెలియదు

అరుకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, సీతంపేట, గుమ్మ లక్ష్మీపురం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛంధంగా హాఫ్‌ డే లాక్‌డౌన్‌లు పాటిస్తున్నారు. కానీ, కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ప్రజలు ఇంకా కట్టుబాట్లు, మూఢ నమ్మకాలతో ఉంటున్నారు. ఇది కూడా ఏజెన్సీలో కోవిడ్ కేసులు పెరగడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

''ఏ జబ్బులు లేని మాకు సూది మందెందుకు అని ప్రశ్నిస్తున్నారు. తీవ్రమైతే కానీ ఆరోగ్య కేంద్రాలకు రావడం లేదు. దీంతో కరోనాకు బలైపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.'' అని ఆరోగ్యాధికారి షణ్ముక్ బీబీసీతో అన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో హెల్త్ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నారు.

విశాఖ ఏజెన్సీ

వ్యాపారులకు 'చెక్' పోస్టు...

కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించక, మూఢ నమ్మకాలతో సమస్యను పెంచుతుంటే కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం గ్రామస్తులు జాగ్రత్తగా ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని పుల్లంగి, శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలోని మానాపురం అలాంటి వాటిలో కొన్ని.

''మా గ్రామానికి అనేకమంది వ్యాపారులు వస్తుంటారు. ఇప్పుడు వారితో పాటు బయటి వారిని కూడా గ్రామంలోకి అనుమతించడం లేదు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకుని వంతుల వారీగా గ్రామ యువకులు పహారా కాస్తున్నారు. అందుకే మా గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు.'' అని పుల్లంగి గ్రామ సర్పంచ్ జార్జిబాబు చెప్పారు.

''మా పక్కనున్న రెండు గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అందుకే మా ఊళ్లో నిబంధనలు పెట్టాం. అత్యవసరంగా ఎవరైనా గ్రామంలోకి వస్తే...కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.'' అని శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని మానాపురానికి చెందిన వెంకటేశ్ చెప్పారు.

విశాఖ ఏజెన్సీ

మావోయిస్టులకు తప్పని కరోనా...

ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏవోబీ) లో మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు చెబుతున్నారు. లొంగిపోతే అలాంటి వారికి వైద్య సేవలు అందిస్తామని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం మంచిది కాదని పోలీసులు అంటున్నారు.

వ్యాధి లక్షణాలున్న వారు సమీపంలోని పోలీస్‌ స్టేషన్లకు వచ్చి చెబితే సకాలంలో చికిత్స అందిస్తామని, వారి పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా, విశాఖ రూరల్ పోలీసులు వేర్వేరు ప్రకటనల్లో ఇటీవల పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: Corona in agency areas,Are superstitions exaggerating the problem
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X