వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: కొత్త పీఆర్సీపై వివాదమేంటి? ఉద్యోగులకు ఇది లాభమా లేక నష్టమా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

నేను దేవాదాయ శాఖలో పనిచేస్తున్నాను. కొత్త పీఆర్సీలో నాకు బేసిక్ రూ. 80వేలకు చేరుతుంది. కానీ మా ఆఫీసు రూరల్ ప్రాంతంలో ఉందనే కారణంతో హెచ్‌ఆర్‌ఏ 24శాతం నుంచి గ్రామం లెక్కలతో 8శాతం మాత్రమే వస్తుందని చెబుతున్నారు. దాంతో పెండింగు డీఏలన్నీ కలిపినా మా నిజ వేతనాల్లో రెండు శాతం పెరుగుదల కూడా ఉండదు.

కానీ ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రాలో పనిచేసిన ఉద్యోగి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో నాకన్నా అదనంగా రూ. 20వేలు తీసుకుంటారు. వారికి పీఆర్సీ ఫిట్‌మెంట్ 30 శాతం వచ్చిది. కాబట్టి బేసిక్‌లోనే పది, పదిహేను వేలు తేడా వస్తుంది. మాకు హెచ్‌ఆర్‌ఏ తగ్గించడం వల్ల అధికంగా నష్టపోతున్నాం. మాతో పోలిస్తే తెలంగాణ ఉద్యోగులు మూడు ఇంక్రిమెంట్లు అదనపు ప్రయోజనం పొందుతున్నట్టయ్యింది అని అంటున్నారు సీనియర్ అసిస్టెంట్ కృపావరం.

PRC

నేను గ్రామ సచివాలయంలో పనిచేస్తాను. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 2021 అక్టోబర్‌తో మేము రెగ్యులర్ ఉద్యోగులం కావాల్సి ఉంది. కానీ అది కాలయాపన చేస్తున్నారు. కొత్త పీఆర్సీ మాకు అమలు చేయడం లేదు. మాకు జీతంలో రూ. 3730 పెంచుతున్నారు. అందులో సీపీఎస్ కోసం రూ. 1460 కట్ అయిపోతే ఇక మాకు నికరంగా పెరిగే జీతం రూ. 2330.

హెచ్‌ఆర్‌ఏ 8 శాతం అంటే మా గ్రామ సచివాలయ సిబ్బందికి దాదాపు రూ. 1200 వరకూ ఇంటి అద్దె భత్యం వస్తుంది. ఆ అద్దెతో రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలోనూ అద్దెకు ఇల్లు దొరకదు. కానీ మాకు వచ్చే జీతంలో ఇంటి అద్దె చెల్లించుకుని కుటుంబ పోషణ అంటే ఎలానో ప్రభుత్వానికి తెలియాలి. లక్షా 30వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారనే సంతోషం ఉన్నప్పటికీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇంత దయనీయంగా ఉంటే ఎలా గడపాలన్నది అంతుబట్టని విషయం అంటున్నారు ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో పనిచేస్తున్న ఎం రవికాంత్.

మూడున్నరేళ్లు దాటిపోయింది..

వాస్తవానికి ఏపీలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 11వ పీఆర్సీ 2018 మే నెల నుంచి అమలు కావాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వం కొంత జాప్యం చేసి అదే ఏడాది జూలై నెలలో పీఆర్సీ కోసం అశుతోష్ మిశ్రా కమిటీ వేసింది. ఆ కమిటీ 2020 అక్టోబర్‌లో నివేదిక ఇచ్చింది.

ఆ నివేదిక అందిన తర్వాత దానిని పరిశీలించేందుకంటూ 2021లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని వేశారు. అందులో ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

ఈ కమిటీ వేతన సవరణ సంఘం నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించింది. దానిని అందుకున్న సీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగులో చర్చించి మంత్రివర్గానికి సిఫార్సులు చేశారు. సీఎస్ కమిటీ తన నివేదికన డిసెంబర్ 12న సమర్పించింది.

పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ మీద కొన్ని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. బహిష్కరించాయి. అయినా ప్రభుత్వం అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను వెల్లడించకుండానే సీఎస్ కమిటీ రిపోర్టు సీఎం వద్దకు చేరింది. ఆ తర్వాత సీఎం సమక్షంలో రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చించి జనవరి 7వ తేదీన అధికారికంగా పీఆర్సీ మీద ప్రకటన చేశారు.

సీఎస్ కమిటీ కేవలం 14 శాతం ఫిట్‌మెంట్ సిఫార్సు చేసిందని, ప్రభుత్వం మాత్రం అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 23 శాతం ఫిట్‌మెంట్ ఇస్తోందని సీఎం జగన్ ఉద్యోగుల సమక్షంలో ప్రకటించారు. దాంతో పాటుగా ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం వంటి కొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకుంది.

మూడున్నరేళ్ల క్రితం నాటి పీఆర్సీ విషయంలో సీఎం ప్రకటనకు అనుగుణంగా జనవరి 17న ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు కోసం ఉత్తర్వులిచ్చింది.

హెచ్‌ఆర్‌ఏ తగ్గింపుపై వ్యతిరేకత

ఈ జనవరి నెల నుంచే కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేస్తూ ఫిబ్రవరి వేతనాల్లో అందిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా జీవోలు విడుదలయ్యాయి. 2019 జూన్ నెలలో ప్రకటించిన మధ్యంతర భృతి కన్నా తక్కువగా పీఆర్సీ ఫిట్‌మెంట్ ఉన్నప్పటికీ చాలామంది తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరచలేకపోయారు.

కానీ తాజా ఉత్తర్వుల్లో హెచ్‌ఆర్‌ఏలో చేసిన మార్పులు ఉద్యోగులకు తీరని నష్టం చేస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఇంటి అద్దె భత్యం శ్లాబులు మారిపోయాయి. గతంలో ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏ కూడా ఇప్పుడు తగ్గించినట్టు కనిపిస్తోంది.

దిల్లీ, హైదరాబాద్‌తో పాటుగా రాష్ట్ర సెక్రటేరియేట్‌లో పనిచేసే సిబ్బందికి గతంలో 30శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చేవారు. ఇప్పుడది 16 శాతానికి పరిమితం చేశారు.

నగరాల్లో అమలు చేసిన హెచ్‌ఆర్‌ఏని 20 నుంచి 16 శాతానికి పరిమితం చేశారు. పైగా నగరానికి సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు కూడా వర్తించిన దానిని తొలగించారు. నగరాలకు సమీపంలో ఉండే సిబ్బందికి హెచ్‌ఆర్‌ఏ ఒక్కసారిగా 20శాతం నుంచి 8 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులకు గతంలో 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ దక్కేది. ఇప్పుడది 8 శాతమేనని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో హెచ్‌ఆర్‌ఏలో కనీసంగా 4 శాతం నుంచి 14శాతం వరకూ తగ్గుదల అనివార్యంగా మారింది.

పీఆర్సీ అంటే వేతనాలు పెరుగుతాయని ఆశిస్తాం. కానీ ఈసారి తగ్గుతున్నాయి. హెచ్‌ఆర్‌ఏలో తగ్గింపు తీవ్ర నష్టం చేస్తోంది. ఐఆర్ 27 శాతం ఇచ్చి ఫిట్‌మెంట్ 23 శాతానికే పరిమితం చేసిన మూలంగా బేసిక్ వేతనాల్లో కూడా ఉపయోగం కనిపించడం లేదు. పెండింగు డీఏలను సర్థుబాటు చేసినప్పటికీ 80 శాతం మంది ఉద్యోగులకు నష్టం తప్పడం లేదు. కనీసంగా రూ. 1500 నుంచి ఐదారు వేల రూపాయల వరకూ నికర జీతాల్లో కోత పడుతోంది. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తుంటే పీఆర్సీ వల్ల ప్రయోజనం లేకపోగా నష్టం కలిగించడం అన్యాయం. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు అంటూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాయుడు అన్నారు.

సమ్మెకు వెనుకాడం: బండి శ్రీనివాసరావు

ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రి మాట మేరకు జనవరి 7 నాటి ప్రకటనలో కొందరికైనా మేలు కలుగుతుందని ఆశించాం. కానీ జీవోలు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఉద్యోగుల కడుపు కొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయినట్టుగా కనిపిస్తోంది. కొందరు అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.

ఈ పీఆర్సీని అంగీకరించబోము. ప్రభుత్వం వాటిని సవరించాల్సిందే. హెచ్‌ఆర్‌ఏ తగ్గుదల, సీసీఏ రద్దు, రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనం కల్పించే అంశాల్లో రాజీపడబోము. ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. అన్ని సమస్యలను చర్చిస్తాం. బుధవారం రెండు జేఏసీల సమావేశం ఉంటుంది. ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తాం. సమ్మెకు సైతం వెనుకాడేది లేదు అంటూ ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు.

ప్రభుత్వం పీఆర్సీ జీవోలు విడుదల చేసిన వెంటనే పలు చోట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఎం ప్రకటన నాటి నుంచే యూటీఎఫ్ సహా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. పది రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు సాగిస్తున్నారు.

పూర్తిగా ఏకపక్షం: ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు

రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికనే పక్కన పెట్టేసింది. సీఎస్ కమిటీ రిపోర్టు పేరుతో ఉద్యోగులను మోసం చేశారు. అర్ధరాత్రి ఉత్తర్వులు పూర్తిగా నిరంకుశం. పదేళ్లకోసారి పీఆర్సీ వంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్రంగా అన్యాయం చేయబోతున్నాయి.

తాజా జీవోల వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమీ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఫిట్‌మెంట్ 43 శాతాన్ని దాదాపు సగానికి పరిమితం చేశారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను తగ్గించడం, పెన్షన్లలో అదనపు ప్రయోజనం తొలగించడం వంటివి అసంబద్ధం. పూర్తిగా ఏకపక్షంగా ఉంది. దీనిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలంతా వ్యతిరేకిస్తున్నాం.

హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల తగ్గింపు వెనక్కి తీసుకోవడం సహా ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అంటూ ఎమ్మెల్సీ వెంకటేశ్వర రావు తెలిపారు.

ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి సహా వివిధ రూపాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన ఆందోళనలో భాగస్వాములవుతామని ఆయన బీబీసీతో అన్నారు.

రెచ్చగొడుతున్నారు: మంత్రి అప్పలరాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సమస్యలు రానురాను పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేతనాలు, పెన్షన్లు కూడా సకాలంలో చేతికందుతున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ సమస్య ఏర్పడుతోంది. ఆదాయం పడిపోవడం, అప్పులు పెరిగిపోవడం వంటి కారణాలతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలకు భారీగా వెచ్చించాల్సి రావడంతో సమస్యలు తప్పడం లేదని ప్రభుత్వం కూడా అంగీకరించింది.

ఇటీవల ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఫిట్‌మెంట్ సహా ఇతర అంశాల్లో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం వీలున్నంత వరకూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రయత్నిస్తోందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే అంశాన్ని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

తాజాగా పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు, వివిధ సంఘాల నేతల సమ్మె హెచ్చరికలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో రెచ్చగొడుతున్నారంటూ అభిప్రాయపడ్డారు.

ఉద్యోగులకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. అందరూ అర్థం చేసుకున్నారు. కానీ జీవోలు వచ్చిన తర్వాత కొందరు ఆందోళనలకు దిగడం, సమ్మె చేస్తామని హెచ్చరించడం సందేహాలకు కారణమవుతోంది. ఎవరో వెనకు ఉండి ఇలాంటి చర్యలకు ప్రోత్సహిస్తున్నారని భావించాల్సి వస్తోంది.

ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. కరోనా కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో వీలున్నంత వరకూ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే పనిలో ఉంది. రిటైర్మెంట్ వయసు పెంచడం వంటి నిర్ణయాలు ఉదారంగా తీసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న టౌన్ షిప్పుల్లో రాయితీలు ఇస్తోంది. ఇంకా అనేక సదుపాయాలు కల్పనకు యత్నిస్తోంది. కానీ పీఆర్సీ విషయంలో కొందరు చేస్తున్న ప్రకటనలు సరికాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్న ప్రభుత్వంతో సామరస్యంగా చర్చించి, సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప అనవసరపు ప్రకటనలు ఆమోదయోగ్యం కాదంటూ ఆయన బీబీసీతో అన్నారు.

ఉద్యోగుల్లో కొత్త పీఆర్సీ పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరయితే పాత పీఆర్సీ ప్రకారమే ప్రయోజనాలు అందించాలనే వరకూ వెళుతున్నారు. మరికొందరు రివర్స్ పీఆర్సీ అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా హెచ్‌ఆర్‌ఏలో తగ్గుదల మూలంగా బకాయి డీఏల విడుదల వల్ల మేలు కలగకపోవడం, హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల మార్పిడితో అత్యధిక మంది మీద నేరుగా ప్రభావం చూపడం దానికి కారణంగా ఉంది.

ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ చేయగల స్థితి లేదని చెప్పడం, ఉద్యోగ సంఘాలు సమ్మె అంటూ హెచ్చరికలు చేయడం రాష్ట్రంలో కొత్త వివాదంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: What is the controversy over the new PRC? Is it a benefit or a loss for employees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X